ఆక్లాండ్ షాపింగ్‌మాల్‌ ఉగ్రదాడి.. ప్రధాని వివరణ

4 Sep, 2021 17:11 IST|Sakshi

న్యూజిలాండ్‌ ఉగ్రదాడిలో గాయపడిన ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. శనివారం ఉదయం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. భావోద్వేగానికి లోనయ్యారు. దాడి జరిగిన క్షణాల్లోనే తీవ్రవాదిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆమె వివరించారు. 


ఆక్లాండ్ సీటి న్యూలిన్‌ షాపింగ్‌ మాల్‌లోని కౌంట్‌డౌన్‌ సూపర్‌ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్‌ 3న) ఓ తీవ్రవాది కత్తితో విచక్షణరహితంగా జనాలపై దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమయంలో అప్రమత్తమైన పోలీసులు తీవ్రవాదిని కాల్చి చంపారు. తీవ్రవాది ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌నకు చెందిన ఐసిస్‌ ప్రేరేపిత ఉగ్రవాది అని, శ్రీలంక నుంచి న్యూజిలాండ్‌కు వచ్చాడని,  కోర్టు ఆదేశాల మేరకు ఇంతకు మించి పూర్తి వివరాలను వెల్లడించలేమని జెసిండా అన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఆమె కంటతడి పెట్టారు.

కత్తుల అమ్మకం బంద్‌
తాజా ఉగ్రదాడి నేపథ్యంలో కౌంట్‌డౌన్‌ సూపర్‌ మార్కెట్‌.. కత్తులను అమ్మకాల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దాడికి పాల్పడే ముందు షాపింగ్‌ చేసినట్లు నటించిన ఉగ్రవాది.. అక్కడి కత్తితోనే దాడికి పాల్పడడం విశేషం. ఇక దాడికి ముందు ఉగ్రవాది బస చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

చదవండి: తాలిబన్ల సంబరాలు.. అమాయకుల మృతి

మరిన్ని వార్తలు