అంగ్‌సాన్‌ సూకీకి మరో నాలుగేళ్ల జైలు

11 Jan, 2022 05:42 IST|Sakshi

బ్యాంకాక్‌: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్‌ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్‌ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు.

గత ఏడాది డిసెంబర్‌లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించారు. సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ఫర్‌ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో గత ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి పలు అభియోగాలు మోపింది. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు