ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

7 May, 2023 21:14 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి భారీ పరిమాణంలోని వింత చేప ఒకటి కొట్టుకు వచ్చింది. దీనిని కేత్‌ రాంప్టన్, టామ్‌ రాంప్టన్‌ అనే దంపతులు తొలుత గుర్తించారు. చేప దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంది. వీరిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను వారు చూసి ఉండలేదు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప అప్పటికే మరణించి ఉంది. 

రాంప్టన్‌ దంపతులు ఈ చేప ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పాటు దీని గురించి కొంత అధ్యయనం చేయడంతో ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. ఇది ‘ఓషన్‌ సన్‌ఫిష్‌’ అని తేలింది. ‘ఓషన్‌ సన్‌ఫిష్‌’ జాతికి చెందిన చేపలు సైజులో భారీవే అయినా, సముద్రాల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. అరుదైన చేపలు కావడంతో వీటి గురించి చాలామందికి తెలీదు.

ఇవి పూర్తిగా ఎదిగితే, నాలుగు మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయని, దాదాపు రెండున్నర వేల కిలోల బరువు ఉంటాయని మెరైన్‌ బయాలజిస్టులు చెబుతున్నారు. ఇవి ఉష్ణమండల తీరాల వద్ద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని వారు అంటున్నారు.
చదవండి: చెరువులో వింత జీవి.. ఒకటి, రెండు కాదు ఏకంగా ఇరవైనాలుగు కళ్లు!

మరిన్ని వార్తలు