ఏడాది క్రితం లవర్ మృతి.. ప్రస్తుతం ఆమె కడుపులో అతని బిడ్డ

30 Jun, 2021 11:19 IST|Sakshi

మరణించిన ఏడాది తర్వాత తండ్రి కాబోతున్న ఆస్ట్రేలియన్‌ ఒలింపిక్‌ స్నోబోర్డర్‌ అలెక్స్‌ పుల్లిన్‌

మరణానంతరం సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చిన అలెక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌

కాన్‌బెర్రా: ప్రస్తుత కాలంలో పిల్లలు కలిగే అవకాశం లేని వారు.. పెళ్లి, భాగస్వామితో పని లేకుండా.. బిడ్డకు జన్మనివ్వాలనుకునే వారు ఎక్కువగా ఎంచుకుంటున్న పద్దతులు ఐవీఎఫ్‌(ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్‌), సరోగసి(అద్దె గర్భం). మన దగ్గర బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌, ఆమిర్‌ ఖాన్‌ మొదలు తుషార్‌ కపూర్‌ వరకు పలువురు ప్రముఖులు ఐవీఎఫ్‌ పద్దతి ద్వారా బిడ్డను పొందారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియాకు చెందిన దివంగత ఒలింపిక్‌ స్నోబోర్డర్‌ అలెక్స్ పుల్లిన్‌ చేరారు. గతేడాది ఆయన మరణించారు. కానీ ప్రస్తుతం అలెక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఆయన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అంటే ఐవీఎఫ్‌ ద్వారా. ఆ వివరాలు...

ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్‌ పుల్లింగ్‌ గతేడాది క్వీన్స్‌లాండ్‌ పామ్ బీచ్‌లోని రీఫ్‌లో స్పియర్ ఫిషింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదశావత్తు అందులో ముగినిపోయాడు. రెస్క్యూ టీం ఆయనను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే అతడు మరణించాడు. విషయం తెలిసి అలెక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఎల్లిడి వ్లగ్ ఎంతో బాధపడింది. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే వారు బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. దాంతో అలెక్స్‌ మరణించిన విషయం తెలిసిన వెంటనే ఆమె అతడి నుంచి వీర్యం సేకరించి భద్రపరిచారు. ఆ తర్వాత ఐవీఎఫ్‌ విధానం ద్వారా, అలెక్స్‌ వీర్యంతో ఎల్లిడి గర్భం దాల్చారు. త్వరలోనే తాను అలెక్స్‌ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు ఎల్లిడి.

ఈ సందర్భంగా ఎల్లిడి మాట్లాడుతూ.. ‘‘అలెక్స్‌కి ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందే మేం పిల్లలను కనాలని ప్లాన్‌ చేసుకున్నాం. ఆ నెలలలో నేను గర్భవతిని అవుతానని ఆశించాను. కానీ కుదరలేదు. అదే సమయంలో తాను ప్రమాదానికి గురై మరణించాడు. దాంతో వేరే మార్గం లేక అతడి వీర్యాన్ని సేకరించి.. ఇలా ఐవీఎఫ్‌ ద్వారా గర్భవతిని అయ్యాను. నేను ఈ విధానాన్ని ఆశ్రయిస్తానని.. అది కూడా అలెక్స్‌ లేకుండా ఒంటరిగా ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది అంత సులభమైన పనేం కాదు. పుట్టబోయే బిడ్డకు నేనే తల్లితండ్రి. ఇద్దరి బాధ్యతలను నేను ఒక్కదానే నేరవేర్చాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. 

క్వీన్స్‌లాండ్‌ చట్టం ప్రకారం, మరణించిన వ్యక్తి అభ్యంతరం చెప్పలేడని ప్రభుత్వం చేత నియమించబడిన అధికారి ప్రకటించిన తర్వాత మాత్రమే వీర్యాన్ని సేకరిస్తారు. ఇలా చేయడానికి ముందు సదరు వ్యక్తి కుటుంబం అనుమతి అవసరం తప్పనిసరి. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ వీర్యం తీసే ప్రక్రియకు సహాయం చేస్తారు. మరణం తరువాత 24 మరియు 36 గంటల వ్యవధిలో వీర్యం సేకరించాల్సి ఉంటుంది.

చదవండి: మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’

మరిన్ని వార్తలు