ఆస్ట్రేలియాలో ‘కిమ్‌’ హల్‌చల్‌.. అవాక్కైన ప్రధాని

13 May, 2022 15:31 IST|Sakshi

Australia PM's Event Kim Jong Un Lookalike Person: ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వేషధారణలో ఒక వ్యక్తి సందడి చేశాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఈ నెల 21 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది.  ఆ ప్రచార ర్యాలిలో ప్రధాని మోరిసన్‌ తనతో కొద్ది స్థానాల తేడాతో ఉన్న స్థానిక సభ్యురాలు గ్లాడిస్‌ లియు అధీనంలో ఉన్న చిషోల్మ్‌లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు.  

అదీగాక ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ పార్టీ సెంటర్‌ రైట్‌ లిబరల్‌ నేషనల్‌ కోయలిషన్‌ ప్రస్తుతం ఓపెనియన్‌ పోలింగ్‌లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కంటే వెనుకబడి ఉంది. ఐతే కిమ్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి మాత్రం ఎన్నికల ప్రచార క్యాంప్‌ నుంచి మోరిసన్‌ నిష్క్రమించిన కొద్దిసేపటికే ఎంటరై తనని ఉత్తర కొరియా అధ్యక్షుడ కిమ్‌జోంగ్‌ ఉన్‌ లాగా కనిపించే హువార్డ్‌ ఎక్స్‌ అనే నటుడుగా  పేర్కొన్నాడు.

అంతేగాదు మోరిసన్‌ లిబరల్‌ నేషనల్‌ కూటమికి ఓటు వేస్తే చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి ఓటు వేసినట్లు అవుతుందంటూ అర్థంపర్థం లేని విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తిని అక్కడ ఉన్న మీడియా బృందం రాజకీయ పార్టీ లేదా ఉద్యమంలో భాగంగా ఇలా మాట్లాడుతున్నారా అని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రధాన మంత్రికి సంబంధించిన మీడియా బృందం అతన్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

ప్రతిస్పందనగా సుప్రీం లీడర్‌ ఏం చేయాలో మీరు చెప్పరు అంటూ వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చాడు. ఐతే ఆస్ట్రేలియన్ సెనేట్ అభ్యర్థి, చైనీస్ ప్రభుత్వ విమర్శకుడు డ్రూ పావ్లౌ మాట్లాడుతూ.. కిమ్‌ వేషధారి హోవార్డ్ ఎక్స్‌ చిషోల్మ్ పర్యటన గురించి తాను గతంలోనే చర్చించానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం కిమ్‌ వేషధారణలో వచ్చిన ఆ విచిత్రమైన వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లే సెల్ఫీ పాయింట్లుగా...)

మరిన్ని వార్తలు