అనవసరంగా మమ్మల్ని లాగొద్దు: ఆస్ట్రేలియా

24 Nov, 2020 12:37 IST|Sakshi

సిడ్నీ: ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం చూపేలా చైనా వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ అన్నారు. సినో- అమెరికా ప్రచ్చన్న యుద్ధంలోకి అనవసరంగా తమను లాగుతున్నారంటూ డ్రాగన్‌ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభావిత దేశం(పెంపుడుకుక్క)గా ఆస్ట్రేలియాను చిత్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలంటూ హితవుపలికారు. ఇరు దేశాలతోనూ సత్పంబంధాలు కోరుకుంటున్నామని, పరస్పర సహకారంతో ముందుసాగితే అందరికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై వ్యాఖ్యలు, చైనీస్‌ కంపెనీ వావే టెక్నాలజీస్‌పై ఆసీస్‌ నిషేధం నేపథ్యంలో చైనా- ఆస్ట్రేలియాల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. (చదవండి: మా రూల్స్‌.. మా ఇష్టం: చైనాకు ఆసీస్‌ వార్నింగ్‌!)

వావే నమ్మదగిన సంస్థ కాదని,  ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు గనుక ఆ సంస్థ వద్ద ఉంటే సదరు దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలోనే ఆసీస్‌, నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుందని చైనా ఆరోపించింది. అంతేగా దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాతో కలిసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ ఆరోపణులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలో 14 రకాల వేర్వేరు అంశాల్లో ఆస్ట్రేలియా వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చైనా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనాను శత్రువుగా భావిస్తే, శత్రువుగానే ఉంటుందంటూ పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. ఈ విషయంపై స్పందించిన స్కాట్‌ మోరిసన్‌ చైనా ఒత్తిళ్లకు తలొగ్గమంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. ఇక తాజాగా అమెరికా- చైనాలతో ఆసీస్‌ బంధం గురించి లండన్‌ ఫోరంకు ఇచ్చిన సోమవారం నాటి ఆన్‌లైన్‌ స్పీచ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇరు దేశాలతోనూ తాము సత్పంబంధాలే కోరుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో తమ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.

అదే విధంగా అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికను స్వాగతించిన మోరిసన్‌, అమెరికా లేదా చైనా ఏదో ఒకవైపే ఉండేలా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక శక్తులు తమ స్వప్రయోజనాలతో పాటు వాటి మిత్రదేశాల ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని, అదే సమయంలో స్వతంత్రంగా వ్యవహరించగలిగే వీలు కలిగించాలని కోరారు. కాగా ట్రంప్‌ హాయంలో అమెరికా- చైనాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక బైడెన్‌ రాకతో పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు