ఆస్ట్రేలియాకు వింత సమస్య.. సాయం చేయనున్న భారత్‌

30 May, 2021 19:34 IST|Sakshi

సిడ్నీ: ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే ఆస్ట్రేలియాకు మాత్రం అనుకోని సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం అక్కడ ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. పెద్ద గుంపుగా ఏర్పడి పంట పొలాలపై దాడి చేస్తు సర్వనాశనం చేస్తున్నాయి. వివరాలు.. గత కొన్ని రోజులుగా న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


పంట పొలాలను నాశనం చేయడమేగాక ఇళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసిన ఎలుకలే దర్శనమిస్తుండడంతో ఏం చేయాలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్లేగు వ్యాది ప్రబలే అవకాశం కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఎలుకల సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను సాయం కోరింది. భారత్‌లో ఎలుకల నివారణకు బ్రోమాడియోలోన్‌ అనే విషపదార్థాన్ని వాడేవారు. ప్రస్తుతం ఈ మందు భారత్‌లో నిషేధంలో ఉంది.

తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి దాదాపు 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్‌ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం ఎలుకలను నివారించేందుకు రూ. 3,600 కోట్లు నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్‌ మందు రాగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతితో ఎలుకలను చంపేందుకు కార్యచరణ మొదలుపెట్టనున్నారు.
చదవండి: మూసేసిన స్కూల్‌లో 215 మంది పిల్లల అస్థిపంజరాలు లభ్యం

 

మరిన్ని వార్తలు