చైనా సిగ్గుపడాలి.. క్షమాపణ చెప్పాలి: ఆస్ట్రేలియా

30 Nov, 2020 13:55 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ చైనాపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నందుకు సిగ్గుపడాలని, తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లో తమ ప్రత్యేక దళాలు 39 మంది నిరాయుధ పౌరులను, ఖైదీలను చట్టవిరుద్ధంగా చంపినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్‌బెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 2005 నుంచి 2016 మధ్య అఫ్ఘన్‌ సైనికుల దుష్ప్రవర్తనపై సుదీర్ఘ దర్యాప్తులో భయంకరమైన నిజాలను తెలుసుకున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆసీస్‌ సైనికుల వ్యవహారశైలిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.(చదవండి: అనవసరంగా మమ్మల్ని లాగొద్దు: ఆస్ట్రేలియా)

ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ సోమవారం ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటో డ్రాగన్‌- కంగారూ దేశాల మధ్య చిచ్చు పెట్టింది. ఓ సైనికుడు చిన్నారి గొంతుపై కత్తి పెట్టిన ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. ‘‘అఫ్గన్‌ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హతమార్చిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి చర్యలను మనం తీవ్రంగా ఖండించాలి. వారిని ఇందుకు జవాబుదారులు చేయాలి’’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై విలేకరుల సమావేశంలో స్పందించిన ఆసీస్‌ ప్రధాని మోరిసన్‌.. ‘‘ ఇలాంటి నిరాధార కథనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదు.

ఈ పోస్టు కారణంగా చైనా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ చర్య.. ప్రపంచ దేశాల దృష్టిలో చైనా మరింత దిగజార్చింది. గత కొన్నిరోజులుగా ఆసీస్‌- చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల పట్ల డ్రాగన్‌ దేశ స్పందన ఎలా ఉందో ప్రపంచం గమనిస్తోంది’’ అని మండిపడ్డారు. నకిలీ ఫొటోలతో తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై వ్యాఖ్యలు, చైనీస్‌ కంపెనీ వావే టెక్నాలజీస్‌పై ఆసీస్‌ నిషేధం నేపథ్యంలో చైనా- ఆస్ట్రేలియాల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.(చదవండి: అప్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికుల దాష్టీకాలు)

చదవండి: చైనా దూకుడు.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు!

మరిన్ని వార్తలు