చైనాకు ఆస్ట్రేలియా గట్టి వార్నింగ్‌!

19 Nov, 2020 19:27 IST|Sakshi

చైనాను శత్రువుగా భావిస్తే.. శత్రువుగానే ఉంటుంది

ఎవరి జోక్యం అవసరం లేదు

మా చట్టాలు, మా నిబంధనలు.. మా ఇష్టం

చైనాకు వార్నింగ్‌ ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. డ్రాగన్‌ దేశ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తేలేదని, తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చైనా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన అనధికారిక డాక్యుమెంట్‌, తమ చట్టాల రూపకల్పన, నిబంధనలపై ఎలాంటి ప్రభావం చూపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మేలో వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా.. తద్వారా చైనీస్‌ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అభివర్ణిస్తూ.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపించింది. (చదవండి: చైనా లక్ష్యంగా 4 దేశాల కీలక ప్రకటన)

అంతేగాక  ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు గనుక వావే వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. ఈ నేపథ్యంలో యూకే, ఆస్ట్రేలియా ఈ చైనీస్‌ కంపెనీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వావేను బ్యాన్‌ చేసినట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. అంతేగాక దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా వ్యవహరిస్తున్న అమెరికాకు, ఆసీస్‌ మద్దతుగా నిలుస్తోంది. అంతేగాక కరోనా వైరస్‌ విషయంలోనూ డ్రాగన్‌ దేశంపై విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో 14 రకాల వేర్వేరు అంశాల్లో ఆసీస్‌ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చైనా పేర్కొంది. (చదవండి: అప్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికుల దాష్టీకాలు)

ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికారి ఒకరు.. ‘‘చైనాను శత్రువుగా భావిస్తే.. చైనా మీ శత్రువుగానే ఉంటుంది’’అంటూ ఆస్ట్రేలియా ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు బుధవారం కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై గురువారం స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌.. ‘‘ మా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా మా చట్టాలు, మా నిబంధనలు మేం రూపొందించుకుంటాం. అలా చేయకుండా ఓ అనధికారిక పత్రం మమ్మల్ని ఆపలేదు. విదేశీ పెట్టుబడుల అంశంపై మేం అస్సలు రాజీపడబోం. 5జీ టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఎలా నిర్మించుకోవాలి, మా సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న అంశాలపై మాకు స్పష్టత ఉంది’’అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇందులో చైనా జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. కాగా ట్రంప్‌ హయాంలో డ్రాగన్‌ దేశంతో విభేదాలు తారస్థాయికి చేరిన శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ఆస్ట్రేలియా- చైనాల గురించి ట్వీట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఆసీస్‌ ప్రధాని ఈ మేరకు స్పందించడం గమనార్హం. ‘‘చైనీస్‌ ఎత్తుగడలు బహిర్గతం చేసే దిశగా ఆస్ట్రేలియా ముందడుగు వేస్తున్న వేళ బీజింగ్‌ నిరాశకు లోనవుతోంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఆసీస్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడవడం చూస్తుంటే ఉత్సాహంగా ఉంది’’అని జాతీయ భద్రతా మండలి పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు