Guinness Record: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు..

8 Mar, 2023 17:42 IST|Sakshi

కాన్‌బెర్రా: వ్యాయామం చేసే వారు తమ బాడీ ఫిట్‌గా ఉండేందుకు కచ్చితంగా పుల్ అప్స్ చేస్తారు. వీటి వల్ల వీపు, ఛాతీ, భుజాల ఖండరాలు ఉత్తేజితమవుతాయి. అయితే ఇవి చేయడం కాస్త కఠినమే. రోజుకు 1,000 పుల్ అప్స్ చేయడమంటే గగనమే.

అయితే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్‌నెస్ ఔత్సాహికుడు మాత్రం పుల్ అప్స్‌లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్‌ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత రికార్డు 7,715 పుల్‌ అప్స్‌ను చెరిపేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను జాక్సన్ ఇటాలియోనో తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ రికార్డు కోసం తాను 8 నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఎట్టకేలకు తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నాడు.

A post shared by Jaxon Italiano (@jaxon_italiano)

గతంలో మరొకరి పేరుపై ఉన్న 12 గంటల్లో 5,900 పుల్ అప్స్ రికార్డును కూడా జాక్సన్ అధిగమించాడు. కాగా.. మొత్తం 24 గంటల్లో చివరి 3.5 గంటలను జాక్సన్ వినియోగించుకోలేదు. తీవ్రంగా అలసిపోవడంతో ఈ సమయంలో ఒక్క పుల్ అప్ కూడా చేయలేదు. అయినా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సత్తా చాటాడు. జాక్సన్ పుల్ అప్స్ రికార్డుతో పాటు ఈ ఒక్క రోజే చారిటీ కోసం రూ.5లక్షల విరాళాలు కూడా సేకరించడం గమనార్హం.
చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి!

మరిన్ని వార్తలు