వీడియో: ‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై బ్రిటన్‌ ప్రజల ఆగ్రహం

20 Sep, 2022 10:05 IST|Sakshi

లండన్‌: బ్రిటిష్‌ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్‌. సోమవారం జరిగిన క్వీన్‌ ఎలిజబెత్‌2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాణి అంత్యక్రియల ఈవెంట్‌ను కవరేజ్‌ చేసే టైంలో ఆస్ట్రేలియాకు చెందిన చానెల్‌-9.. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ను గుర్తు పట్టలేకపోయింది. టీవీ ప్రజెంటర్స్‌ ట్రేసీ గ్రిమ్‌షా, పీటర్‌ ఓవర్టన్‌లు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.  ఆ సమయంలో.. తన భర్త హ్యూ ఓలీరేతో వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేకు వచ్చారు లిజ్‌ ట్రస్‌. 

కారు నుంచి బయటకు వచ్చిన లిజ్‌ ట్రస్‌ను ఉద్దేశించి గ్రిమ్‌ షా..‘ఎవరామె?’ అంది. ‘గుర్తుపట్టడం కష్టంగా ఉంది. బహుశా మైనర్‌రాయల్స్‌(రాజకుటుంబంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న సభ్యులు) కావొచ్చు. నాకు తెలియడం లేదు అని ఓవర్టన్‌ అన్నారు. ‘స్థానిక వేషధారణలోనే వస్తున్నారు కదా. బహుశా అక్కడి ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లేమో. దురదృష్టవశాత్తూ.. ప్రతీ ఒక్కరినీ మనం గుర్తించడం కష్టం’ అంటూ గ్రిమ్‌షా బదులిచ్చారు. అయితే.. 

వెంటనే వాళ్లు తమ తప్పిదాన్ని తెలుసుకున్నట్లున్నారు. ఓవర్టన్‌ స్పందిస్తూ.. ఆ మిస్టరీ గెస్ట్‌ ఎవరో కాదు యూకే ప్రధాని లిజ్‌ ట్రస్‌ అంటూ చెప్పారు. అయితే అప్పటికే ఆ తప్పిదాన్ని పట్టేసిన కొందరు స్పందన మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా టీవీ హోస్ట్‌లు యూకే ప్రధానిని ‘మైనర్‌రాయల్స్‌’గా సంభోదించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బ్రిటన్‌ ప్రజలు. ఆస్ట్రేలియా చానెల్‌కు ఆమాత్రం లిజ్‌ ట్రస్‌ తెలీదా అంటూ మండిపడుతున్నారు. 

బోరిస్‌ జాన్సన్‌ తదనంతరం.. బ్రిటన్‌ ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ తరపున రిషి సునాక్‌ను ఓడించి ఎన్నికయ్యారు లిజ్‌ ట్రస్‌. సెప్టెంబర్‌ 6వ తేదీన ఆమె బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టగా.. అనంతరం రెండు రోజులకే క్వీన్‌ ఎలిజబెత్‌-2 కన్నుమూశారు.

ఇదీ చదవండి: యూకేలో ఆలయాలపై దాడులు... భారత్‌ ఖండన

మరిన్ని వార్తలు