స్పెషల్‌ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్‌.. పీతల కోసం

24 Nov, 2021 11:36 IST|Sakshi

సాధారణంగా ఎక్కడైనా ప్రజల కోసం బ్రిడ్జిలు కడుతుంటారు. కానీ ఆస్ట్రేలియాలోని క్రిస్మస్‌ ద్వీపంలో మాత్రం ప్రత్యేకంగా పీతల కోసం కడతారు. ఒకేసారి గుంపులు గుంపులుగా బయటకు వచ్చే ఆ ఎర్ర పీతలు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వాహనాలు, ప్రజల వల్ల ఇబ్బంది పడకుండా ఆ వంతెనలు ఏర్పాటు చేస్తుంటారు. క్రిస్మస్‌ ద్వీపంలో మొదటి వాన పడగానే ఎర్ర పీతలు లక్షలాదిగా రోడ్లమీదికి వచ్చేస్తాయి. అవి ఉండే అడవి నుంచి సముద్రం వైపు వెళ్తాయి. అన్ని పీతలు ఒకేసారి రోడ్లమీదికి వచ్చేస్తే జనాలకు ఇబ్బందే కదా. ఆ దారుల్లోంచి వాహనాలు వెళ్తే పీతలకు కూడా ఇబ్బందే.

అందుకే ఇటు పీతలు, అటు జనాలు ఇబ్బంది పడుకుండా క్రిస్మస్‌ ఐలాండ్‌ నేషనల్‌ పార్కు సిబ్బంది బ్రిడ్జిలు కడతారు. పీతలు బయటకు రావడానికి కొద్ది నెలల ముందు నుంచే బ్రిడ్జిలు కట్టడం మొదలుపెడతారు. బయటకు వచ్చిన పీతలు చక్కగా వాటి మీది నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ పీతల దారుల్లో జనాలు, వాహనాలు వెళ్లకుండా గుర్తులు కూడా పెడతారు. ఇంతకీ ఆ పీతలు అలా సముద్రం వైపు ఎందుకు వెళ్తాయనుకుంటున్నారు? గుడ్లు పెట్టడానికి. సముద్రం దగ్గర ఆడ, మగ పీతలు ఒక్కటై ఆ తర్వాత సముద్రంలోకి ఆడ పీతలు గుడ్లు వదులుతాయి. ఒక్కో పీత సముద్రంలోకి దాదాపు లక్ష గుడ్లను వదుల్తుందట. నెల తర్వాత పిల్ల పీతలు తీరానికి వచ్చి అటు నుంచి అడవిలోకి వెళ్తాయట. క్రిస్మస్‌ ద్వీపంలో ఇది ఎప్పుడూ జరిగేదే.  

మరిన్ని వార్తలు