80 ఏళ్లకు..80 లగ్జరీ కార్లు

24 Dec, 2020 18:28 IST|Sakshi

ప్రస్తుతం ఆయన గ్యారేజీలో 38కార్లు

నెలకు ఒకటి.. రెండు వారాంతాల్లో రెండు

వియన్నా: అందమైన ఇల్లు, విలాసవంతమైన కారు సొంతం చేసువాలనే కోరిక సగటు మానవుడికి అందమైన కలగానే మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక పెద్దాయన కార్లను చూస్తే   పలువురు సెలబ్రిటీలు, బిలియనీర్లకు సైతం అసూయ కలగాల్సిందే. అది కూడా  ఆయన కొన్నది అలాంటి ఇలాంటి కార్లు కాదు.. ప్రపంచంలోనే అతి ఖరీదైన కార్లు.  గత ఐదు దశాబ్దాలుగా కార్లను కొంటూనే ఉన్న ఆయన తన 80 ఏళ్ల వయసుకి తగ్గట్టుగా ఏకంగా 80 కార్లను సొంతం చేసుకున్నాడు.  అభిరుచికి తగ్గట్టుగా కార్లను కొనడమే కాదు.. అంతే గొప్పగా గ్యారేజీని కూడా ఏర్పాటు చేశారు. ‘లివింగ్‌ రూం’ గా పిలుచుకునే తన గ్యారేజ్‌ను అంతకంటే ఖరీదైన భవనంగా తీర్చిదిద్దుకోవడం మరో విశేషం. దీన్ని బట్టే లగ్జరీకార్లపై ఆయనకున్న మోజును అర్థం చేసుకోవచ్చు.

ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన 80ఏళ్ల ఒట్టొకర్ జె ఏకంగా 80 లగ్జరీ కార్లను సేకరించడం విశేషంగా నిలిచింది. లగ్జరీ కార్లు సేకరించటమంటే జెకు కొన్ని దశాబ్దాలుగా  సరదా.  తాజాగా ఒట్టొకర్ జె  80వ పోర్సే బాక్స్టర్ స్పైడర్ కారును  కొనుగోలుచేసి మొత్తం ప్రపంచాన్నే తన వైపునకు తిప్పుకున్నారు. 1972లో ఒట్టొకర్ మొదటి పోర్సే కారును కొన్నాడు.  ఇక​ అప్పటి నుంచి తన గ్యారేజీని వివిధ పోర్సే మోడళ్లతో నింపేస్తూనే ఉన్నారు. దాదాపు 50ఏళ్ల క్రితం ఒకరోజు అతడు రోడ్డుపై వెళ్తుండగా పోర్సే కారు అతని పక్కనుంచి  దూసుకెళ్లిందట. ఇక అంతే అప్పటినుంచి వాటిపై ప్రేమ పిచ్చి పిచ్చిగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే  డబ్బులు పొదుపు చేసి మరీ  కార్లను  కొనుగోలు చేసేవారు. అలా తొలి పోర్సే స్పీడ్ ఎల్లో 911 ఈ కారును  ఇంటికి తెచ్చుకున్నారు.

ప్రస్తుతం జె గ్యారేజీలో 38 వేర్వేరు పోర్సే మోడల్ కార్లు ఉన్నాయి. నెలలో రోజుకు ఒకటి,  రెండు వారాల్లో వీకెండ్స్‌ ఒకటి చొప్పున వాడతానని  చెప్పుకొచ్చారు ఒట్టొకరే. తాజాగా మియామి బ్లూ కలర్  పోర్సే బాక్స్‌స్టర్‌ స్పైడర్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి తొలి కస్టమర్ ఒట్టొకరే కావటం మరో విశేషం. ఇంకా రేస్ కార్లు, ఎనిమిది సిలిండర్ల ఇంజిన్ ఉండే పోర్స్చే 910, 917, 956, 904, 964 కప్ లాంటి మోడల్స్‌ ఆయనగ్యారేజ్‌లో కొలువుదీరాయి.ఇప్పటి వరకు తొమ్మిది వెర్షన్ల కారెరా ఆర్ ఎస్ మోడళ్లను సేకరించగా, భవిష్యత్తులో మరికొన్ని కార్లను సేకరిస్తానని ఒట్టొకర్ చెబుతున్నారు. హ్యూమన్‌ టచ్‌ లేకపోతే..పోర్సే కార్లు కేవలం యంత్రాలు మాత్రమే..  అదే మనుషుల తోడుంటే.. అవి  కూడా ప్రాణం ఉన్న మనుషుల్లాంటివే..అంటారు మురిపెంగా జె .. తన గ్యారీజేలోని అందమైన గ్యాలరీని చూసుకుంటూ..

మరిన్ని వార్తలు