‘చిట్టి’ తల్లి.. చనుబాలతో ఎందరో బిడ్డల ఆకలి తీర్చాలనుకుంది! ఆటంకాలు ఎందుకంటే..

17 May, 2022 21:27 IST|Sakshi

సాల్ట్‌ లేక్‌ సిటీ: బిడ్డల ఆకలిని తీర్చేందుకు అక్కడి తల్లులు పడుతున్న అవస్థలు చూసి ఓ తల్లి చలించిపోయింది. విమర్శలు ఎదురవుతాయని తెలిసినా.. ఒక అడుగు ముందుకు వేసింది. తన చనుబాలను ఇచ్చి ఎంతో మంది బిడ్డల ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది. 

అమెరికా యూటా చెందిన అలైస్సా చిట్టి తన ఇంట్లో మూడు ఫ్రీజర్ల నిండా చనుబాలను నిల్వ చేసి ఉంచింది. మొత్తం పాల క్వాంటిటీ 118 లీటర్లు!!. తొలుత ఆమె ఉచితంగానే పాలను పంచాలని అనుకుందట. అయితే మిల్క్‌ బ్యాంక్‌ల నుంచి పాలు పంచే పద్ధతి సుదీర్ఘంగా ఉండడం, అదే జరిగితే ఆలస్యం అవుతుందనే ఆలోచనతో ఆమె ఈ ఉపాయం చేసింది. ఔన్స్‌ పాలకు డాలర్‌ వసూలు చేయడం మొదలుపెట్టి.. తల్లులకు పాలు పంచుతోంది. 

చిట్టి ఈ పని మొదలుపెట్టినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తల్లి పాలతో వ్యాపారం చేస్తోందంటూ కొందరు మండిపడ్డారు. కానీ, పద్ధతి ప్రకారం వెళ్తే ఆమె అనుకున్న పని జరగదు. అందుకే ఇలా.. అమ్మకం ద్వారా పంచుతోంది. బేబీ ఫార్ములా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పుడు బేబీ ఫార్ములా(బిడ్డ ఆకలి తీర్చే ఉత్పత్తుల) కొరత కొనసాగుతోంది. అమెరికా వ్యాప్తంగా 40 శాతం బేబీ ఫార్ములా ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా ఉంది. ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ప్రొడక్షన్‌ ప్లాంట్‌ మూతపడిపోవడంతో ఈ సంక్షోభ పరిస్థితి నెలకొంది.

బేబీ ఫార్ములా అనేది ఏడాది లోపు పసికందులకు ఇచ్చే అథెంటిక్‌ ఫుడ్‌.  తన బిడ్డ కూడా ఆ తరహా ఫుడ్‌కు అలవాటు పడిందనేనని, ఆ కష్టాలేంటో తెలిసే ఇలా సాయం చేస్తున్నానని అలైస్సా చిట్టి అంటోంది. అయితే ఆమె ఇంటర్వ్యూ తర్వాత నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఎదురుకావడంతో.. ప్రస్తుతానికి చనుబాలను అమ్మే ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఆమె ఆపేసింది. 

ఎందుకు అడ్డంకులు..
అమెరికాలో ఆన్‌లైన్‌లో తల్లి పాలను కొనుగోలు చేయడం, విక్రయించడం ఖచ్చితంగా చట్టబద్ధమైనదే అయినా నియంత్రణ లేని వ్యవహారం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశాల ప్రకారం.. తల్లి పాలను నేరుగా వ్యక్తుల నుంచి లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా పొందినప్పుడు..  దాత అంటు వ్యాధులు లేదంటే నాణ్యత ప్రమాణాల కోసం పరీక్షించబడే అవకాశం ఉండదు. అదే ఒకవేళ పాలను మిల్క్‌ బ్యాంకుకు విరాళంగా ఇవ్వడం వల్ల వారాల తరబడి స్క్రీనింగ్‌ ఉంటుంది. అందుకే మిల్క్‌ బ్యాంకుల ద్వారానే పంచాలని చెప్తున్నారు వైద్య నిపుణులు.

మరిన్ని వార్తలు