కాబూల్‌ కంచె దాటిన పిల్లాడు.. పెంపుడు తండ్రి ఒడి నుంచి కన్నీళ్ల నడుమ అప్పగింత

10 Jan, 2022 11:31 IST|Sakshi

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సమయంలో.. పలు హృదయవిదారక దృశ్యాల్ని ప్రపంచం వీక్షించింది. అఫ్ఘన్‌ నుంచి పారిపోవడానికి విమానాల రెక్కలు, టైర్ల మధ్య కూర్చోవటం.. గగనతలం నుంచి కిందపడి పౌరులు ప్రాణాలు పోగొట్టుకోవడం, తాలిబన్ల నుంచి కనీసం తమ పిల్లలను, ఆడకూతుళ్లను రక్షించుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాల వంటి ఘటనలు కలిచివేశాయి. ఈ పరిస్థితుల్లో కాబుల్‌లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో.. ఓ పసికందును ఫెన్సింగ్‌ దాటించిన ఫొటో గుర్తుండే ఉంటుంది.


అయితే ఆ సైనికుడు బాబును తిరిగి తమవద్దకు చేరుస్తారని భావించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ఆ నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలు అయ్యాయి. ఈ ఘటన గత ఏడాది ఆగస్టు నెలలో జరగగా.. నాలుగు నెలలపాటు నిద్రాహారాలు మానేసి బిడ్డ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఆ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఆ బాబు మళ్లీ తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. కానీ, పెంచిన తండ్రి కన్నీళ్ల నడుమ.. ఆ చేరిక భావోద్వేగానికి పంచుతోంది.

వివరాల్లోకి  వెళ్లితే.. ఆ చిన్నారి పేరు సోహైల్ అహ్మదీ. అతని తండ్రి మీర్జా అలీ అహ్మదీ. అతను యూఎస్‌ ఎంబసీ సెక్యూరిటీ గార్డు(మాజీ). తన భార్య సురయా నలుగురు పిల్లలు వెంటబెట్టుకొని అమెరికా తరలిపోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ముందుగా బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లోకి చేరవేయాలని.. ఫెన్సింగ్‌ దాటించాడు. ఆపై ఆ తర్వాత బాబు కనిపించకుండా పోయాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కనిపించిన ఆ పసికందును.. ట్యాక్సీ డ్రైవర్‌ హమీద్ సఫీ గుర్తించాడు. గందరగోళ పరిస్థితుల్లో బాబును ఎవరికి ఇవ్వలో అతనికి అర్థం కాలేదు. పైగా పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను అల్లా ఇచ్చిన బిడ్డగా భావించి పెంచుకోవాలని ఇంటికి తీసుకెళ్లాడు సఫీ. 


చిన్నారి సోహైల్‌ను తాతకు కన్నీళ్లతో అప్పగిస్తున్న సఫీ

ఈ ఘటన తర్వాత మూడు నెలలపాటు మీర్జా అలీ అహ్మదీ.. కాబూల్‌లోనే ఉండిపోయి కొడుకు కోసం వెతుకుతూనే ఉంది. బిడ్డపై ఆశలు పోతున్న క్రమంలో చివరికి పునరావాసం కింద అమెరికాకు వెళ్లింది ఆ కుటుంబం. అయితే బిడ్డను వెతికే పని ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావి(మీర్జా అలీ మామ)కి అప్పగించాడు. చివరికి రెడ్‌క్రాస్‌ సాయంతో ఆ చిన్నారి టాక్సీ డ్రైవర్‌ సఫీ వద్ద బాబు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఖాసేమ్ రజావి.. సఫీ వద్దకు పంపి బాబును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే సఫీ ముందు ససేమీరా అన్నాడు. పోలీసులు కిడ్నాప్‌ కేసు పెడతామని హెచ్చరించారు. అయినా సఫీ బెదరలేదు. చివరికి కన్నప్రేమకు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కరిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూనే.. బాబు సోహైల్‌ను తాత రజావి చేతికి అందించాడు.

‘సోహైల్‌ను తల్లిదండ్రుల చెంతకు చేర్చటం తన బాధ్యత’ అని తాత ఖాసేమ్ రజావి మీడియాకు తెలిపాడు.

మరిన్ని వార్తలు