వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన కాలేజీ

4 Nov, 2020 14:49 IST|Sakshi

బాలి: కరోనా వైరస్‌ అందరి జీవితాల్లో పేను మార్పులు తెచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అన్ని రంగాలు ఎంతో దెబ్బతిన్నాయి. విద్యా రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. పాఠశాలలు, కాలేజీలు మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే వారి బాధలు వర్ణణాతీతం. ఇదిలా ఉంటే పాఠశాలలు తెరిచినా.. పిల్లలను బడికి పంపలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందరో తల్లిదండ్రులు. తినడానికి తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న వారు ఇక వేలకు వేలు ఫీజులు చెల్లించి పాఠశాలలకు పంపడం అంటే మాటలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తలల్లిదండ్రుల కష్టాలను గమనించిన ఓ హాస్పిటాలిటీ కళాశాల ఈ సమస్యకు ఆసక్తికరమైన పరిష్కారంతో ముందుకు వచ్చింది. అది ఏంటంటే విద్యార్థులు ఫీజుకు బదులు కొబ్బరి బొండాలు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ఎన్నో కుటుంబాలకు మేలు చేసింది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కాలేజీ మనదేశంలో లేదు. ఇది బాలిలో జరిగింది. 

బాలిలోని టెగలాలాంగ్‌లోని వీనస్ వన్ టూరిజం అకాడమీ తన విద్యార్థుల ట్యూషన్ ఫీజును నగదుకు బదులు కొబ్బరికాయల రూపంలో చెల్లించడానికి అనుమతించింది. ఆర్థిక మందగమనం, నష్టాల కారణంగా ఫీజు చెల్లించలేని కుటుంబాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎందరికో మేలు జరగడమే కాక విద్యార్థులలో వ్యవస్థాపకత స్ఫూర్తిని పొందుపరిచింది అంటున్నారు అకాడమీ సిబ్బంది. ఎలా అంటే వారు తీసుకువచ్చే కొబ్బరికాయలను ఉపయోగించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్‌ వయన్ పసేక్ ఆది పుత్రా మాట్లాడుతూ.. ‘కోవిడ్‌ వల్ల అందరి ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఫీజుల భారంతో విద్యార్థులు చదువుకు దూరమవ్వకూడదని ఈ విధానాన్ని తీసుకువచ్చాం. ఫీజు బదులు కొబ్బరి కాయలు ఇవ్వొచ్చు. విద్యార్థులు తీసుకువచ్చిన కొబ్బరి కాయలను ఉపయోగించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఉత్పత్తి చేస్తాం’ అని తెలిపారు. (చదవండి: పేదరికాన్ని అనుభవించా.. అందుకే)

ఈ అకాడమీ కొబ్బరికాయలతో పాటు స్థానికంగా దొరికే మోరింగా, గోటు కోలా అనే ఔషధ మొక్కల ఆకులను కూడా ఫీజు కింద తీసుకుంటుంది. కొబ్బరి నూనె, ఈ ఔషధ మొక్కలను ఉపయోగించి హెర్బల్‌ సబ్బులను తయారు చేస్తామని అకాడమీ సిబ్బంది వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. 

మరిన్ని వార్తలు