బంగ్లాదేశ్‌లో 'సిత్రాంగ్' బీభత్సం.. 35 మంది మృతి.. అంధకారంలోకి 80 లక్షల మంది..

26 Oct, 2022 08:11 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.

సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో విద్యుత్ సరఫారాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 80 లక్షల మంది అంధకారంలోనే ఉండిపోయారు. ఎక్కడికక్కడ చెట్లు, స్తంభాలు నేలకొరిగాయని, బుధవారం వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు తెలిపారు.

వరదల ధాటికి 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 6,000 హెక్టార్ల పంట దెబ్బతింది. వేల  చేపల ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది.

అయితే మంగళవారం సాయంత్రం నాటికి తుఫాను తీవ్రత తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. వరదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాన్ కారణంగా సోమవరం తాత్కాలికంగా నిలిపివేసిన విమాన సర్వీసులను 21 గంటల తర్వాత మంగళవారం నుంచి పునరుద్ధరించినట్లు వెల్లడించారు.

చెట్టు కూలి విషాదం
తుఫాన్ సమయంలో కుమిలా జిల్లాలో ఓ ఇంటిపై చెట్టుకూలి తల్లిదండ్రులతో పాటు 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ఘటనల్లో మొత్తం 35 మంది మరణించినట్లు పేర్కొన్నారు. 

డెల్టా ప్రాంతమైన బంగ్లాదేశ్‌లో తరచూ తుఫాన్‌లు, వరదలు సంభవించి 1.6 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగానే గతంతో పోల్చితే అత్యంత ప్రమాదకర  విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..!

మరిన్ని వార్తలు