వైట్‌ హౌస్‌లో సందడి చేసిన బరాక్‌ ఒబామా దంపతులు

8 Sep, 2022 17:02 IST|Sakshi

వాషింగ్టన్‌: బరాక్‌ ఒబామా, మిచెల్‌ ఒబామా అమెరికా వైట్‌ హౌస్‌కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. వాస్తవానికి బరాక్‌ ఒబామా దంపతులు 2017లో వైట్‌ హౌస్‌ని విడిచిపెట్టిన తదనతరం మళ్లీ తమ అధికారిక పోర్ట్రెయిట్‌ల(చిత్రపటాల) ఆవిష్కరణ కోసం తొలిసారిగా వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చారు.

ఇది అమెరికా వైట్‌ హౌస్‌ సంప్రదాయ వేడుక. 2012లో చివరిగా జరుపుకున్న సంప్రదాయాన్ని మళ్లీ అందరికీ తిరిగి గుర్తు చేసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఈ మేరకు జో బైడెన్‌ ఈ పోర్ట్రెయిట్‌ ఆవిష్కరణ వేడుక కోసం బరాక్‌ ఒబామా దంపతులకు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ వేడుకలో జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ పాల్గొన్నారు. ఈ వేడుకతో అమెరికా ప్రజలకు బరాక్‌ ఒబామా దంపతులు మరింత చేరవయ్యారని బైడెన్‌ అన్నారు.

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో సతమతమవుతుండటంతో వైట్‌ హౌస్‌లో ఈవెంట్లను జరపడం కోసం చాలా కాలంగా నిరీక్షించామని జిల్‌ బైడెన్‌ అన్నారు.  అంతేకాదు ఈ పవిత్రస్థలంలో వారి చిత్ర పటాలను గోడలకు వేలాడదీయడంతో అధికారంలోకి రానున్న తరాల వారికి స్ఫూర్తిగానే గాకుండా గత స్మృతులు కళ్లముందు మెదిలాడి సవాళ్లును ఎదర్కొనే ధ్యైర్యాన్ని ఇస్తాయన్నారు జిల్‌ బైడెన్‌. ఈ పోర్ట్రెయిట్‌ ఆవిష్కరణ సంప్రదాయం 1965 నుంచి అసోసియేషన్‌ చేపట్టింది.

తొలిసారిగా ఈ పోర్ట్రెయిట్‌లను చిత్రించిన కళాకారుల పేర్లును కూడా వెల్లడించారు. ఒబామా చిత్రపటాన్ని రాబర్ట్ మెక్‌కర్డీ, మిచెల్‌ ఒబామా చిత్రపటాన్ని షారన్ స్ప్రంగ్ చిత్రించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అమెరికా అదృష్టమని ప్రశంసించారు.  ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైస్‌ ప్రెసిడెంట్‌గా బైడెన్‌ తనకు ఎన్నో సలహాలు, సూచలను అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఎన్నో విపత్కర సమయాల్లో బైడెన్‌ తనకు చక్కటి మార్గ నిర్దేశం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రపటాలను చిత్రించిన కళాకారులను సైతం మెచ్చుకోవడమే కాకుండా వారి పనితీరుని కూడా ఎంతగానో ప్రశంసించారు. తన దృష్టిలో ఈ పోర్ట్రెయిట్‌లకు మరింత ప్రాముఖ్యత ఉందని, అవి జార్ట్‌, మార్తా, వంటి నాటి మహోన్నత అధ్యక్షుల చిత్రాల సమక్షంలో తమ చిత్రాలు ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఒబామా చెప్పారు. 

(చదవండి: స్వీట్‌ బాక్స్‌లో ఏకంగా రూ.54 లక్షలు)

మరిన్ని వార్తలు