భారత్‌ విజయగాథ అపూర్వం

18 Nov, 2020 04:27 IST|Sakshi

‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లోబరాక్‌ ఒబామా ప్రశంసలు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రతిభాశాలి అంటూ ప్రశంసలు

చిన్ననాటి నుంచే భారత్‌పై మక్కువ ఉందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు

వాషింగ్టన్‌ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్‌లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్‌లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు.

2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్‌ కాయిదా అధ్యక్షుడు బిన్‌ లాడెన్‌ను  హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్‌ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు..

మన్మోహన్‌పై ప్రశంసలు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్‌ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని,  నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్‌  సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్‌ సింగ్‌ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు.  

వినడం సోనియాకు ఇష్టం..
2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్‌ గాంధీ  తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్‌లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్‌ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా