‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్‌ మహిళల ఆవేదన

25 Dec, 2022 17:31 IST|Sakshi

కాబుల్‌: అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ, అఫ్గాన్‌ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు తాలిబన్లు. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని హుకుం జారీ చేశారు. ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకు దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. యూనివర్సిటీల దగ్గర భారీగా బలగాలను మోహరించి వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తమ హక్కులను కాలరాయడంపై అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు మార్వా అనే యువతికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు ఆమె సోదరుడు ఒక్కడే వెళ్తాడని తెలిసి మనోవేదనకు గురైంది మార్వా. మహిళలపై నిషేధం విధించటం వారి తల నరకడం కన్నా చాలా బాధకారమని పేర్కొంది.

‘ఒకవేళ వారు మహిళలను శిరచ్ఛేదం చేయమని ఆదేశిస్తే.. అది కూడా ఈ నిషేధం కంటే మెరుగ్గా ఉండేది. మనం ఇంత దురదృష్టవంతులమైతే, మనం పుట్టి ఉండకపోతేనే బాగుండేది. నేను ఈ భూమిపై ఉన్నందుకు బాధపడుతున్నా. మనల్ని పశువులకన్నా హీనంగా చూస్తున్నారు. పశువులు ఎక్కడికైనా వెళ్లగలవు. కానీ, బాలికలకు ఇంట్లోంచి బయట అడుగుపెట్టేందుకు కూడా హక్కు లేదు. ’ అని ఆవేదన వ్యక్తం చేసింది 19 ఏళ్ల మార్వా.  

కాబుల్‌లోని మెడికల్‌ యూనివర్సిటీలో మార్చి నుంచి మెడికల్‌ డిగ్రీలో చేరేందుకు ఇటీవలే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది మార్వా. అతన సోదరుడు హమిద్‌తో పాటు యూనివర్సిటీకి వెళ్లాలని కలలను కంది. అయితే, తాజా నిర్ణయం ఆమె ఆశలను నాశనం చేసింది. తనతో పాటు చదువుకుని తన సోదరి లక్ష‍్యాన్ని సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు హమిద్‌. ఎన్నో కష్టాలను దాటుకుని తన సోదరి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు తెలిపాడు. 

45% బాలికలు డ్రాపవుట్‌ 
2021 సెప్టెంబర్‌ నుంచి అఫ్గాన్‌లో సెకండరీ స్కూల్స్‌లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్‌ అయ్యారు.

ఇదీ చదవండి: Afghanistan: రెక్కలు విరిచేస్తున్నారు.. అఫ్గాన్‌ యూనివర్సిటీల్లో అమ్మాయిలకు ఇక నో ఎంట్రీ

మరిన్ని వార్తలు