మానని గాయం: అద్భుతం జరిగితే తప్ప..

6 Sep, 2020 11:19 IST|Sakshi

బీరూట్‌ పేలుళ్లు: ప్రజలను వెంటాడుతున్న విషాదం

బీరూట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుళ్లు సంభవించి నెల రోజులు దాటిపోయింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమైన ఆ భీతావహ ఘటన ప్రజలను ఇంకా వెంటాడుతోంది. సుమారుగా 191 మంది ప్రాణాలను బలి తీసుకున్న తీవ్ర విషాదం నుంచి వారు నేటికీ కోలుకోలేపోతున్నారు. ప్రమాదం సమయంలో మిస్సయిన ఏడుగురి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ‘లెబనాన్‌’గుండెను నిలువునా చీల్చిన ఆ చేదు ఘటన నిజం కాకపోయి ఉంటే బాగుండునని, శిథిలాల కింద పడి ఉన్న వాళ్లు కొన ఊపిరితోనైనా బతికి ఉంటారనే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అయితే చిలీ రక్షణ బృందాలు చెప్పిన విషయాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. సెన్సార్‌ రీడింగ్‌లో వెల్లడైనట్లుగా.. పేలుళ్లలో ధ్వంసమైన భవన శిథిలాల కింద ఓ ఒక్కరు ప్రాణాలతో మిగిలిలేరనే చేదు నిజాన్ని చెప్పాయి. (చదవండి: ‘అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది’)

కాగా గత నెల 4న బీరూట్‌ పోర్టులో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్‌ వలన భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గత ఏడాది కాలంగా లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి కారణంగా... పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం లెబనియన్ల జీవితాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. కనీసం శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసే టెక్నాలజీ కూడా అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ప్రభుత్వం చిలీ, అమెరికా, ఫ్రాన్స్‌ నుంచి రక్షణ బృందాలను రప్పించగా నేటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

హార్ట్‌బీట్‌ వినిపించింది..
ఈ క్రమంలో శిథిలమైన ఓ భవనం వద్ద మానవ హృదయ స్పందనను(హార్ట్‌బీట్‌) పోలిన శబ్దాలను హైటెక్‌ సెన్సార్లు గుర్తించడంతో రక్షణ బృందాలు అక్కడ గాలింపు ముమ్మరం చేయగా వారికి నిరాశే మిగిలింది. అక్కడ మనిషి ఆనవాలు కనిపించలేదని చిలీ రెస్క్యూ స్పెషలిస్టు ఫ్రాన్సిస్కో లెర్మాండా శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఆ భవనం కింద మనిషి బతికి ఉన్నాడనడానికి ఎలాంటి ఆనవాలు లభించలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అక్కడ ఎవరూ సజీవంగా లేరు’’అని విచారం వ్యక్తం చేశారు.

ఇక పోర్టు సమీపంలో ఓ జాగిలం సెంట్‌ వాసన పసిగట్టి పరుగులు తీయడంతో.. ఇద్దరు మహిళా వర్కర్లు అక్కడ గల టన్నెల్‌ చివరి వరకు వెళ్లి మృతుల జాడ కోసం వెదకగా.. ఎవరూ కనిపించలేదు. అయినప్పటికీ.. ‘‘పాక్షికంగా ధ్వంసమైన భవనాలు కూలిపోతాయనే భయం వెంటాడినా సరే అణువణువూ గాలిస్తాం. బాధితులను వెలికితీసేందుకు మా వంతు ప్రయత్నం కొనసాగిస్తాం’’అని సివిల్‌ డిఫెన్స్‌ అధికారి ఖాసీం ఖటార్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు అన్నిచోట్లా శిథిలాలను తొలగించే ప్రక్రియ పూర్తై పోవచ్చిందని తెలిపారు. 

అద్భుతం జరిగితే తప్ప..
అయితే లెబనీస్‌ అధికారులు మాత్రం..  ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఘోర ప్రమాదం నుంచి తేరుకుని బతికే ఛాన్స్‌ ఉండదని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక ఫిల్మ్‌ మేకర్‌ సలీం మురాద్‌ మాట్లాడుతూ.. ‘‘అద్భుతం జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్‌ దేవుడా.. బీరూట్‌ మిరాకిల్‌కు వేదిక కాగల ఆశీర్వాదాలు అందించూ’’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

ఇక మృతులను వెలికితీసేందుకు ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న చిలీ రక్షణ బృందాలపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిని నిజమైన హీరోలుగా వర్ణిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు చెబుతున్నారు. బీరూట్‌ పేలుళ్ల ఘటనకు నెల రోజులు పూర్తైన సందర్భంగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశ ప్రజలంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా ఈ ఘోర విషాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్‌ దియాబ్‌ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు