2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ వల్లే..

6 Aug, 2020 05:32 IST|Sakshi
శక్తివంతమైన పేలుడు ధాటికి ధ్వంసమైన బీరుట్‌ పోర్ట్‌. రెండో రోజు కూడా వెలువడుతున్న పొగ

5,000 మందికి పైగా గాయాలు

భవనాలు, వాహనాలు ధ్వంసం.. భారీగా ఆస్తి నష్టం 

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్‌ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి.

పోర్ట్‌ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్‌ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు.  

ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్‌   
2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్‌ మంత్రి మొహమ్మద్‌ ఫహ్మీ చెప్పారు. బీరుట్‌ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్‌ డయాక్సైడ్‌ గ్యాస్‌ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి.  

ఆహార సంక్షోభం తప్పదా?  
చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్‌ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్‌ పోర్ట్‌ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది.   

భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి  
లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.   

మిన్నంటిన ఆక్రందనలు
కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్‌ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్‌ సైరన్‌లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్‌ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి.

ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్‌ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి.   

లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం
లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్‌ జెసా రెవిక్‌ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి.

బీరుట్‌లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్‌ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి.

కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి
ప్రపంచ దేశాలకు లెబనాన్‌ ప్రధాని వేడుకోలు  
ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్‌లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్‌ ప్రధానమంత్రి హసన్‌ దియాబ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు.   


పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త   


పేలుడులో గాయపడిన చిన్నారి


పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

మరిన్ని వార్తలు