మానవ తప్పిదమే; బీరూట్‌ పోర్టు డైరెక్టర్‌ అరెస్ట్‌

7 Aug, 2020 15:28 IST|Sakshi

బీరూట్‌: లబనాన్‌ రాజధాని బీరూట్‌లో పేలుడు ఘటనకు బాధ్యుడిగా బీరూట్‌ పోర్టు డైరెక్టర్‌ను లెబనాన్‌ మిలటరీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో 135 మంది ప్రాణాలు విడువగా దాదాపు 5 వేల మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్‌ ఫాదీ అకీకీ నేతృత్వంలో పోలీసులు పోర్టు డైరెక్టర్‌ హస్సాన్‌ కోరేటమ్‌ని అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ మీడియా ఎన్‌ఎన్‌ఏ తెలిపింది. హస్సాన్‌ కోరేటమ్‌తో పాటు మరో 16 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. వీరంతా పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ ఉంచిన గోడౌన్‌ 12 వద్ద విధుల్లో ఉన్నారని పేర్కొంది. పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల్లో గోడౌన్‌ 12 సిబ్బంది నిర్లక్షాన్యికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయని ఎన్‌ఎన్‌ఏ మీడియా తెలిపింది. పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పింది.
(చదవండి: చెన్నైలో 700 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు)

కాగా, మానవ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు లెబనాన్‌ దేశాధ్యక్షుడు మిచెల్‌ అవున్‌ స్పష్టం చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఇగోర్ గ్రెచుష్కిన్‌విగా తేలిందని, దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించే అవకాశం ఎన్‌ఎన్‌ఏ మీడియా సంస్థ వెల్లడించింది. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్‌ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, తాజా పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయని లెబనాన్‌ వాసులు వాపోతున్నారు. దర్యాప్తులతో ఒరిగేదేమీ ఉండదని, పేలుడు పదార్థాలు పోర్టులోకి రాకుండే అడ్డుకుంటే చాలని అంటున్నారు.
(కొడుకును ర‌క్షించుకునేందుకు తండ్రి ఆరాటం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా