బీరూట్‌ పేలుళ్లు : 30 గంటలు సముద్రంలోనే..

6 Aug, 2020 20:43 IST|Sakshi

బీరూట్‌ : లెబనాన్‌ రాజధాని బీరూట్‌‌ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడు జరిగిన 30 గంటల తర్వాత సముద్రంలో ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అయ్యాడు పోర్టులో పని చేసే కార్మికుడు. భారీ పేలుళ్ల అనంతరం మిస్సయిన వారి జాడ తెలుసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేట్‌ చేసిన అకౌంట్‌లో రక్తపు మడుగులో ఉన్న అమిన్‌ అల్‌ జహెద్‌ ఫోటో కనిపించింది. భారీ పేలుళ్ల అనంతరం తీవ్రగాయాలైన అమిన్‌ అల్‌ జహెద్‌ మధ్యధరా సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది.

రెస్క్యూ సిబ్బంది అమిన్‌ని కాపాడిన అనంతరం పడవపై పడుకోబెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తీవ్రగాయాలతో ఉన్న అతన్ని రఫిక్‌ హరీరీ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సముద్రంలో 30 గంటలపాటూ ఎలా బతుకుపోరాటం చేశాడనే సమాచారం తెలియాల్సి ఉంది. బీరూట్‌‌లో సంభ‌వించిన భారీ పేలుళ్లలో 137 మంది మృతిచెందగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. (2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ వల్లే..)

2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్‌ మంత్రి మొహమ్మద్‌ ఫహ్మీ చెప్పారు. బీరూట్‌‌ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్‌ డయాక్సైడ్‌ గ్యాస్‌ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి.  

మరిన్ని వార్తలు