Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’

24 May, 2021 11:55 IST|Sakshi
Courtesy: Reuters

ఒక్కడిని అరెస్టు చేయడం కోసం విమానాన్ని మళ్లించారు

యుద్ధ విమానం పంపించి హైడ్రామా

బాంబు బెదిరింపు ఉందని సమాచారం ఇచ్చి ఆపేశారు

బెలారస్‌ తీరుపై భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం

ఇది హైజాక్‌ కంటే తక్కువేమీ కాదని విమర్శలు

‘‘అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు’’

వెబ్‌డెస్క్‌: గ్రీస్‌ నుంచి లిథువేనియా వెళ్లాల్సిన రియాన్‌ఎయిర్‌ విమానం 4978 అది. దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆ విమానం బెలారస్‌ వైపు మళ్లింది. యుద్ధ విమానం వెంబడి రాగా ఆ దేశ రాజధాని మింక్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. లోపల ఉన్న ప్రయాణికులకు అసలేమీ అర్థం కాలేదు. లిథువేనియా వెళ్లాల్సిన విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆపేశారు.. ఇందుకు గల కారణాలేమీటో వారికి అంతుపట్టలేదు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం వెంటనే జరిగే పరిణామాలను ఊహించి, లగేజ్‌బ్యాగ్‌​ నుంచి వడివడిగా తన లాప్‌టాప్‌, మొబైల్‌ తీసుకుని పక్కనే ఉన్న అమ్మాయికి అందించాడు. 

అంతలోనే అక్కడికి చేరుకున్న బెలారస్‌ పోలీసులు 26 ఏళ్ల ఆయువకుడిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు 7 గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్‌ లిథువేనియాకు చేరుకోవడంతో ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు గానీ ఆ యువకుడి పరిస్థితి ఏమౌతుందో అనే ఆలోచన వాళ్ల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. యూరోపియన్‌ దేశాలు సహా అమెరికా బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తోంది. అసలు ఆ విమానాన్ని ఎందుకు ఆపారు? ఇందుకు బెలారస్‌ చెప్పిన కారణం ఏమిటి? ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడిని ఎందుకు తీసుకువెళ్లారు? 


ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌

ఎవరా యువకుడు?
రోమన్‌ ప్రొటాసెవిక్‌.. జర్నలిస్టు. నెక్స్‌టా గ్రూపు మాజీ ఎడిటర్‌. గతేడాది బెలారస్‌లో జరిగిన ఆందోళనకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించాడు. అందుకుగానూ అతడిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే రోమన్‌పై అనేక అభియోగాలు నమోదుకాగా.. ఎప్పుడెప్పుడు అతడిని అరెస్టు చేయాలా అన్న అలోచనలో ఉంది. దీంతో అతడు పొలాండ్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆదివారం లిథువేనియాకు వెళ్లే క్రమంలో బెలారస్‌లో రోమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరణం తప్పదన్నాడు
ఈ విషయం గురించి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. నిజానికి అతడు అరవడం లేదు, కానీ తను చాలా భయపడిపోతున్నట్లు అర్థమైంది. ఒకవేళ కిటికీ గనుక తెరిచే అవకాశం ఉంటే, కచ్చితంగా దూకేవాడేనేమో. తనను కిందకి తీసుకువెళ్లి ఏవేవో ప్రశ్నలు అడిగి తీసుకువెళ్లారు’’ అని పేర్కొన్నారు.

హైడ్రామా.. ఏం చెప్పి విమానాన్ని ఆపారు?
విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అత్యవసరంగా మింక్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయాలంటూ బెలారస్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి సందేశం వచ్చింది. అంతలోనే ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వస్తున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు ఉన్న ఆనవాలు కనిపించలేదు. కానీ, రోమన్‌ను బయటకు పిలిచారు. అతడితో పాటు ఓ మహిళను పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లారు.

ఈ విషయాన్ని బెలారస్‌ అధికార మీడియా ధ్రువీకరించింది. ‘‘బాంబు బెదిరింపు రావడంతో మిస్టర్‌ లుకాషెంకో వ్యక్తిగత ఆదేశాలు జారీ చేశారు. విమానాన్ని మింక్‌లో ల్యాండ్‌ చేయాలని ఆదేశించారు. ఇందుకు మిగ్‌-29 ఫైటర్‌ ఎస్కార్టుగా ఉండేందుకు అనుమతించారు’’ అని పేర్కొంది. అయితే, అప్పటికే విమానం మింక్‌ కంటే కూడా, లిథువవేనియా విల్‌నూయిస్‌కే దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెలారస్‌ ఉద్దేశపూర్వకంగానే రోమన్‌ కోసం ఫ్లైట్‌ను మళ్లించి, బాంబు నాటకం ఆడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా రియాన్‌ ఎయిర్‌.. ప్రయాణికులను క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రోమన్‌ మద్దతుదారులు మాత్రం. ‘‘రియాన్‌ఎయిర్‌ ... రోమన్‌ ఎక్కడ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌

భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం
ఒక జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్‌ ఇంతటి సాహసానికి పూనుకోవడం సరికాదంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెలారస్‌పై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి విమానయాన విభాగం ఐసీఏఓ.. బలవంతంగా విమానాన్ని ల్యాండ్‌ చేయించారు. ఇది చికాగో కన్వెన్షన్‌ నిబంధనలు ఉల్లంఘించడమే’’ అని పేర్కొంది. కాగా చికాగో కన్వెన్షన్‌లో  గగనతలం, విమానాల సురక్షిత ప్రయాణాలకై పలు నిబంధనలు ఉన్నాయి. 

‘‘సాధారణ పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఇలా ఆపడం అంటే హైజాక్‌ చేసినట్లే. ఇంతటి దుస్సాహసానికి పూనుకున్న బెలారస్‌ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని పోలండ్‌ ప్రధాని మండిపడ్డారు.  ఇక బెలారస్‌లోని అమెరికా రాయబారి జూలీ ఫిషర్‌.. ‘‘అంతర్జాతీయ సమాజం, పౌరులకు వ్యతిరేకంగా లుకాషెంకో ప్రభుత్వం వ్యవహరించింది. బాంబు ఉందన్న అబద్ధపు సందేశంతో మిగ్‌-29ను పంపించి రేనార్‌ను మళ్లించింది. నెక్స్‌టా జర్నలిస్టుపై రాజకీయ కక్షతో నమోదైన అభియోగాల నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు చేపట్టిన ఈ చర్య చాలా ప్రమాదకరం’’ అని ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఇక లాటివియా, లిథువేనియా ఏకంగా బెలారస్‌ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. రాజకీయ ప్యత్యర్థిని కిడ్నాప్‌ చేయడం కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టిన బెలారస్‌ గగనతలంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలని సూచిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపే విధంగా అమెరికా యూరోపియన్‌ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు