పుతిన్‌కు ఊహించని షాక్‌.. ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్‌

26 Mar, 2022 18:43 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యాలు దాడులు కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా బాంబు దాడులతో ఉక్రెయిన్‌లోని నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌కు భారీ నష్టం జరిగింది. రష్యా దాడుల కారణంగా ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, రక్షణ సామాగ్రిని అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధం జరుగుతున్న వేళ తమ దేశం తరఫున పోరాడేందుకు వాలంటీర్లు రావాలని అభ్యర్థించారు. దీంతో ఇప్పటికే పలు దేశాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌ ఆర్మీతో కలిసి రష్యా బలగాలపై పోరాడుతున్నారు. భారత్‌ తరఫున తమిళనాడుకు చెందిన సైనికేశ్‌ రవిచంద్రన్‌ కూడా ఉక్రెయిన్‌ ఆర్మీలో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా రష్యా బలగాల దాడులను తిప్పికొట్టేందుకు బెలారస్‌కు చెందిన ఔత్సాహిక ఫైటర్లు ఉక్రెయిన్‌ సైన్యంలో చేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కీవ్‌ ఇండిపెండెంట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. బెలారసియన్ 19వ శతాబ్దపు రచయిత, విప్లవకారుడు కస్టస్ కలినౌస్కి పేరుతో ఏర్పడిన బెలారసియన్ వాలంటీర్ బెటాలియన్ సభ్యులు ఉక్రెయిన్‌ సైన్యంతో భాగమైనట్లుగా ప్రమాణం చేసినట్లు ఈ వీడియోలో ఉన్నది. ఈ సందర్భంగా మారు మాట్లాడుతూ.. స్వతంత్ర ఉక్రెయిన్‌ కోసం తాము పోరాడతామని.. ఎందుకంటే ఉక్రెయిన్‌ స్వతంత్రంగా లేకపోతే భవిష్యత్‌లో బెలారస్‌ కూడా స్వతంత్రంగా ఉండదని ఈ గ్రూప్‌కు నాయకత్వం వహించిన పావెల్ కులజంకా స్పష్టం చేశారు.

మరోవైపు.. బెలారస్‌ నుంచే రష్యా బలగాలు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. బెలారస్‌ను 28 ఏండ్లుగా పరిపాలిస్తున్న అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్నారు. దీంతో రష్యన్‌ బలగాలు ఉత్తర బెలారస్‌ సరిహద్దు మీదుగా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెలారసియన్ వాలంటీర్ బెటాలియన్ సభ్యులు.. బెలారసియన్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మాదిరిగా కాకుండా ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

మరిన్ని వార్తలు