ట్విటర్‌ కొత్త సీఈవోగా ఆమె! మస్క్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌, అయితే..

22 Dec, 2022 21:09 IST|Sakshi

న్యూయార్క్‌: ట్విటర్‌ సీఈవోగా తప్పుకునేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు ఎలన్‌ మస్క్‌. దీంతో ట్విటర్‌ బాస్‌గా బాధ్యతలు మూణ్ణాళ్ల ముచ్చటేనా? అనే ప్రశ్న, ఒకవేళ  అదే నిజమైతే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చా జోరందుకుంది. ఈలోపు తనను సీఈవోగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలంటూ ఒకావిడ చేసిన ట్వీట్‌..  ఈ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌కు కారణమైంది. 

బెస్ కాల్బ్(35).. తనకు ట్విటర్‌ కొత్త సీఈవోగా అవకాశం ఇచ్చినందుకు ఎలన్‌ మస్క్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్‌ చేసింది. ఇప్పటివరకు తాము(ఎలన్‌ మస్క్‌) కలుసుకోనేలేదని, ఈ పరిణామం తనకు ఆశ్చర్యం కలిగిందని చెబుతూనే.. సీఈవో బాధ్యతలను తాను ఒక గౌరవంగా భావిస్తానని పోస్ట్‌ చేసింది. ఆపై వరుసగా ఐదు పోస్టులు చేశారామె. అంతేకాదు..ఆపై మొదటి రోజు బాధ్యతలు నిర్వర్తించానని, అద్భుతంగా ఉందని పోస్ట్‌ కూడా చేసింది. అయితే.. 

బెస్ కాల్బ్.. ఎవరో కాదు. పాపులర్‌ టీవీ షో ‘జిమ్మీ కుమ్మెల్’కు స్క్రిప్ట్‌ రైటర్‌. ఎమ్మీ అవార్డుకు సైతం నామినేట్‌ అయ్యారామె. హ్యూమర్‌తో కూడిన రైటింగ్‌కు ఆమె పెట్టింది పేరు. దీంతో ఆమె సరదాగా, వ్యంగ్యంగా అలా ట్వీట్లు చేసి ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆమె ఎలన్‌ మస్క్‌ను విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. 

ఇక కొత్త సీఈవో బాధ్యతలపైనా తొలుత సరదాగా స్పందించిన మస్క్‌.. ఆ తర్వాత సీరియస్‌గా సమాధానం ఇచ్చారు. తాము కేవలం సీఈవోగా గురించి వెతకడం లేదని.. బాధ్యతతో ట్విటర్‌ను నిలబెట్టే వ్యక్తి కోసం వెతుకుతున్నామని తెలిపారు. మరోవైపు ట్విటర్‌ కొత్త సీఈవో కోసం వేటలో ఆ సంస్థ ఉన్నట్లు అనధికార సమాచారం.

మరిన్ని వార్తలు