వీడియో: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు.. 25వ సవరణ ఊసెత్తిన ట్రంప్‌

2 Jun, 2023 07:41 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. తన చేష్టలతో తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు. ఉన్నట్లుండి మరిచిపోవడం, ఒకవైపు వెళ్లాల్సింది మరోవైపు వెళ్లడం, ఉన్నట్లుండి కిందపడిపోవడం.. అంతెందుకు ఆ మధ్య సైకిల్‌ నుంచి కిందపడిన సందర్భమూ ఉంది. తాజాగా.. ఆయనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

గురువారం కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్‌ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన బైడెన్‌.. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తుళ్లి ముందుకు పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన్ని పక్కకు తీసుకెళ్లగా.. అక్కడున్నవాళ్లతో కలిసి ఆయన కూడా చిరునవ్వులు చిందించారు.

ఎనభై ఏళ్ల బైడెన్‌ క్షేమంగానే ఉన్నట్లు వైట్‌ హౌజ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ బెన్‌ లాబోల్ట్‌ ట్వీట్‌ చేశారు. కానీ..ఇక.. ఆయన శారీరకంగా ఫిట్‌గా ఉన్నారని, నిత్యం ఎక్సర్‌సైజులు గట్రా చేస్తున్నారని ప్రకటించారు. 2020 నవంబర్‌లో పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కిందపడి కాలు విరగొట్టుకున్నారు బైడెన్‌. అయితే ఆ గాయం నుంచి త్వరగానే కోలుకున్నారాయన.

బైడెన్‌ కిందపడిన సందర్భంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాడు. బైడెన్‌కి మానసికంగానే కాదు.. ఇప్పుడు నడవడానికి కూడా కష్టంగా ఉంది. అమెరికన్ల రక్షణ కోసం పార్లమెంట్‌(అమెరికన్‌ కాంగ్రెస్‌) ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను(అధ్యక్ష స్థానాన్ని మరొకరితో భర్తీ చేయించడం) తెర మీదకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ట్వీట్‌ చేశారాయన. బైడెన్‌కి ఇది కొత్త కాదంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. వయసు పైబడిన వ్యక్తి కదా సహజమేనంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యే సముద్రంలోకి దూకాడు.. రియల్‌ హీరో అయ్యాడు

మరిన్ని వార్తలు