తిడతావా? తిట్టు.. నేనేం పుతిన్‌లా కాదు: బైడెన్‌ వెటకారం

2 May, 2022 12:24 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెటకారం ప్రదర్శించాడు. తనను విమర్శించినా పర్వాలేదని అంటూనే.. తానేం పుతిన్‌లా నియంతను కాదంటూ సూటి వ్యాఖ్యలు చేశాడు. 

ప్రముఖ కమెడియన్‌ ట్రెవోర్‌ నోవాహ్‌.. ఆదివారం వైట్‌హౌజ్‌లో జరిగిన ఆన్యువల్‌ వైట్‌హౌజ్‌ కరెస్పాండెంట్స్‌ అసోషియేషన్‌ డిన్నర్‌కు హజరయ్యాడు. ఆఫ్రికా(దక్షిణాఫ్రికా) తరపున ఈ ఘనత దక్కించుకున్న తొలి వ్యక్తి కూడా ట్రెవోర్‌ నోహ్‌. అయితే ట్రెవోర్‌ను జో బైడెన్‌ స్వయంగా వేదిక మీదకు ఆహ్వానించాడు. 

లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌.. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ట్రెవోర్‌. ఇక నేను నా సీట్‌లో కూర్చుంటా. ట్రెవోర్‌.. మీకొక శుభవార్త. మీరు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని నిరభ్యరంతంగా విమర్శించొచ్చు. మాస్కోలో లాగా మిమ్మల్నేం అరెస్ట్‌ చేయబోం. మీరు స్వేచ్ఛగా చెలరేగిపోవచ్చు’’ అంటూ బైడెన్‌ చమత్కరించాడు. 

ఇక్కడ బైడెన్‌ కౌంటర్‌ ఇచ్చింది నేరుగా పుతిన్‌కే. రష్యాతో పుతిన్‌ ఎవరైనా తనను విమర్శిస్తే కటకటాల పాలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పుతిన్‌ రాజకీయ ప్రత్యర్థి,  ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2020లో నవల్నీపై సీక్రెట్‌ ఏజెంట్‌ ద్వారా పుతిన్‌ విషప్రయోగం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విమానంలో ఉండగానే.. జర్మనీకి అత్యవసర చికిత్స కోసం వెళ్లాడు నవల్నీ. అక్కడి నుంచి కొంత గ్యాప్‌ తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. అయితే.. రష్యా వచ్చిరాగానే అక్రమ కేసులు బనాయించి తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించాడంటూ పుతిన్‌పై రాజకీయ పరమైన విమర్శలూ ఉన్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. బైడెన్‌ హామీ ఇచ్చాడుగా.. అందుకే తనదైన శైలిలో విమర్శలకు దిగి హాస్యం పండించాడు ట్రెవోర్‌.

చదవండి: పుతిన్‌కు సర‍్జరీ.. తాత్కాలిక బాధ్యతలు ఆయనకే?

మరిన్ని వార్తలు