హమ్మర్‌.. ‘షేక్‌’ అయ్యేలా..

29 Mar, 2022 05:00 IST|Sakshi

కార్లంటే ఇష్టం చాలా మందికి ఉంటుంది. కానీ దుబాయ్‌కు చెందిన ఓ షేక్‌కి మాత్రం పిచ్చి. అందుకే... కార్ల కోసం ఏకంగా షార్జా ఆఫ్‌రోడ్‌ హిస్టరీ మ్యూజియంనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మ్యూజియమ్‌లో ఉన్న కార్లన్నీ ఒకెత్తు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు మరో ఎత్తు. ఇటీవలే అతని మ్యూజియంలోకి చేరిన ఈ హమ్మర్‌ విశేషాలు తెలుసుకుందాం..     
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌  

హమ్మర్‌ కారు ప్రపంచంలోనే అతి పెద్దది. జనరల్‌ మోటార్స్‌ సంస్థ ఈ హమ్మర్‌ హెచ్‌1ఎక్స్‌3ని రూపొందించింది. ఇది పూర్తిస్థాయిలో నడపగల జెయింట్‌ కార్‌. అమెరికా ఆర్మీకి చెందిన లార్క్‌–ఎల్‌ఎక్స్‌ కార్గో వెహికల్‌ ఫ్రేమ్‌పై ఈ కారును తయారుచేశారు. నాలుగు చక్రాలకు నాలుగు డీజిల్‌ ఇంజన్లను ఏర్పాటు చేశారు. బయట చూడటానికి సాధారణ హమ్మర్‌నే పోలి ఉంటుంది. కానీ, దానికంటే మూడు రెట్లు పెద్దది. ఈ జెయింట్‌ కారు కింది భాగంలో సాధారణ హమ్మర్‌ను నిలపొచ్చంటే... కారు ఎంత ఎత్తు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారులో రెండు అంతస్తులున్నాయి. మొదటి అంతస్తులో స్టీరింగ్‌ కేబిన్, టాయిలెట్, మెట్లున్నాయి. ఇక రెండో అంతస్తు పూర్తిగా విలాసవంతమైన గెస్ట్‌ స్పేస్‌. ఇందులో కూర్చుని నాలుగు వైపులా చూడొచ్చు. చూడటానికి కారే అయినా లగ్జరీ విల్లాలో ఉన్న ఫీలింగ్‌ కలిగిస్తుందన్నమాట.  

దీన్ని దుబాయ్‌కు చెందిన బిలియనీర్‌ షేక్‌ హమద్‌బిన్‌ హమ్దాన్‌ అల్‌ హన్యన్‌ కొన్నాడు. ఇప్పటికే 718 మోడళ్ల కార్లను సేకరించి పెట్టుకున్న వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు హమద్‌. దుబాయ్‌కి ఉత్తరంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని ‘షార్జా ఆఫ్‌ రోడ్‌ హిస్టరీ మ్యూజియం’కు తరలించేందుకు ఇటీవల రోడ్డు మీదకు తెచ్చారు. ఈ భారీ కారును నడిపించేందుకు డ్రైవర్‌తోపాటు చిన్నపాటి సైన్యమే అవసరమైంది. గంటకు 20 కి.మీ. మాత్రమే ప్రయాణించగలిగే ఈ వాహనం... రోడ్డు మీద రెండు లేన్లను ఆక్రమించేసింది. దీంతో రహదారిని పూర్తిగా బ్లాక్‌ చేయాల్సి వచ్చింది. నెమ్మదిగా వెళ్తున్న ఈ భారీ కారును చూసి జనం ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. 

మరిన్ని వార్తలు