ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?

27 May, 2021 15:22 IST|Sakshi

సింగపూర్‌: విస్తీర్ణ పరంగా చూస్తే భారత్‌ రాజధాని ఢిల్లీ అంత కూడా లేని చిన్న దేశం సింగపూర్‌.  55 ఏళ్ల క్రితం ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు  చాలామంది ప్రజలు మురికివాడల్లోనే జీవించేవారు. అలాంటిది పూరి గుడిసెల నుంచి ధగధగలాడే ఆకాశ మేడల దేశంగా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే శక్తిమంతమైన, సంపన్న దేశంగా సింగపూర్ ఎదగడానికి అక్కడి పౌరులు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రవాణా, భద్రత, ఉత్పాదకత, ఆరోగ్యం లాంటి అనేక అంశాల్లో సింగపూర్ ముందు వరసలో ఉంది.

అక్కడి నేతలు, అధికారులు అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి చాలా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది. సింగపూర్‌లో సగటు ఆదాయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది విదేశీ ధనవంతులు అక్కడ స్థిరనివాసాలు ఏర్పరుచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 

కరోనా మహమ్మారితో వచ్చిన మార్పు

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం...చైనా, ఇండోనేషియా ,మలేషియా నుంచి చాలా మంది ధనవంతులు షాపింగ్ చేయడానికి, క్యాసినోలో బాకరట్ ఆడటానికి లేదా ప్రపంచ స్థాయి క్లినిక్‌లలో వైద్య పరీక్షలు పొందటానికి సింగపూర్‌ వస్తుంటారు. కరోనా మహమ్మారి అన్నింటినీ మార్చింది. ఎంతో మంది వ్యాపారవేత్తలు తమ కుటుంబంతో సహా వచ్చి నెలల తరబడి సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో తుపాను నుంచి బయటపడటానికి వసతిని కోరుతున్నారు.

అంతే కాకుండా తలసరి ప్రాతిపదికన మలేషియా, ఇండోనేషియాలో మరణాల రేటు సింగపూర్ కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సింగపూర్‌ కఠినమైన ఆంక్షలను అవలంబిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో 30శాతం మందికి  వ్యాక్సిన్‌లను అందించారు. ఇది చైనా, మలేషయా, ఇండేనేషియా దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ.

(చదవండి: వైరల్‌: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’)

>
మరిన్ని వార్తలు