జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే

4 Jul, 2022 04:50 IST|Sakshi

దెబ్బతింటే అనారోగ్య సమస్యలు

వాషింగ్టన్‌: విదేశాల నుంచి విమానంలో వచ్చినవారు రెండు మూడు రోజుల దాకా జెట్‌లాగ్‌తో ఇబ్బంది పడడం తెలిసిందే. వారి శరీరంలోని జీవగడియారం అస్తవ్యస్తం కావడమే ఇందుకు కారణం. ఇది మన ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఒక క్రమపద్ధతి, క్రమశిక్షణకు శరీరం అలవాటు పడుతుంది. అందులో హఠాత్తుగా మార్పు వస్తే శరీరం వెంటనే ఆ మార్పును అందిపుచ్చుకోలేదు. ఫలితంగా జీవ క్రియలు దెబ్బతింటాయని, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

జీవగడియారాన్ని సిర్కాడియన్‌ రిథమ్‌ అని పిలుస్తారు. మెదడు మధ్యభాగానికి సమీపంలో హైపోథాలమస్‌ ఉంటుంది. ఇందులోని 20,000 న్యూరాన్లతో జీవగడియారం ఏర్పడుతుంది. ఊపిరి పీల్చడం, శరీరంలో రక్త ప్రసరణ వంటి అసంకల్పిత చర్యలను సమన్వయం చేసే బాధ్యత హైపోథాలమస్‌దే. చాలామంది భావిస్తున్నట్లు జీవ గడియారం కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువులు, పక్షులు, మొక్కలు, ఫంగస్, బ్యాక్టీరియాలోనూ ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కొన్ని రకాల జీవులు చురుగ్గా ఉండడానికి, నిర్దేశిత సమయాల్లో మొగ్గలు పువ్వులుగా వికసించడానికి వాటిలోని జీవగడియారమే కారణం.  

హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే..  
మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే వారిలో జీవగడియారం చక్కగా పనిచేయాలి. రోజువారీగా ఆహారం, కాంతి వంటి వాటికి శరీర భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన మార్పులను జీవగడియారమే నిర్దేశిస్తుంది. వయసు పెరుగుతున్నకొద్దీ జీవగడియారం పనితీరు సైతం మందగిస్తుంది. సిర్కాడియన్‌ క్లాక్‌ జీన్స్‌లో మ్యుటేషన్ల వల్ల నిద్రపట్టకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. రాత్రిపూట పనిచేసేవారిలో సిర్కాడియన్‌ రిథమ్‌ సక్రమంగా ఉండదు. ఫలితంగా స్థూలకాయం, టైప్‌–2 డయాబెటిస్, క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు, భౌతిక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. మెదడులోని పినియల్‌ గ్రంథి మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. చీకటి పడిన తర్వాత నిద్ర ముంచుకు రావడానికి ఈ హార్మోన్‌ దోహదపడుతుంది.

ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వచ్చే నీలిరంగు కాంతి వల్ల మెలటోనిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. చివరకు నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆకలిని నియంత్రించే హార్మోన్‌ లెప్టిన్‌. సరైన నిద్ర ఉంటేనే లెప్టిన్‌ ఉత్పత్తి చక్కగా ఉంటుంది. రోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకోవడం, నిద్రించడం వం అలవర్చుకుంటే శరీరం సానుకూలంగా ప్రతిస్పందిస్తుందని, జీవగడియారం పనితీరు మెరుగవుతుందని, శారీరక, మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయని పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్‌ కీమోథెరఫీ, యాంటీ–ఒబేసిటీ చికిత్సలకు జీవగడియారం పనితీరు చాలా కీలకమని తెలియజేశారు. సిర్కాడియన్‌ క్లాక్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరగుతున్నాయి. దీనిపై తెలుసుకోవాల్సిన సమాచారం ఇంకా చాలా ఉందని ఉందని అంటున్నారు.

మరిన్ని వార్తలు