ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. అయినా వాటికి అదే ఇష్టం!

31 Mar, 2021 07:51 IST|Sakshi

పిట్టది, చెట్టుది అవినాభావ సంబంధం.. పిట్టలు గూళ్లు కట్టుకుని బతకడానికి చెట్లు కావాలి.. గింజలు దూరంగా పడి చెట్లు విస్తరించడానికి పిట్టలు కావాలి.. కానీ ఆ చెట్లు, వాటి గింజలే పిట్టలకు ప్రాణాంతకమైతే..? పిట్టలన్నీ ఇష్టంగా వచ్చి గూళ్లు కట్టుకునే చెట్టే.. వాటి ప్రాణాలు పోవడానికి కారణమైతే..? అవును.. అలాంటి ఓ చెట్టు కథే ఇది. ఆ చెట్టు పేరు పిసోనియా. అన్ని చెట్లలా ఇదీ ఓ సాధారణ చెట్టే అయినా.. పక్షులు చనిపోవడానికి కారణమై ‘బర్డ్‌ క్యాచర్‌’ అనే పేరు తెచ్చుకుంది. మరి ఎందుకిలా జరుగుతోంది, కారణం ఏమిటో తెలుసా? 

మిగతా చెట్లలాగానే ఉన్నా.. 
ఆఫ్రికా, ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో పెరిగే ఈ పిసోనియా చెట్లు కూడా మిగతా సాధారణ చెట్ల లాంటివే. అన్నింటిలాగే పూలు పూస్తాయి, గుత్తులుగా గింజలు ఏర్పడుతాయి. ఇవి విషపూరితమో, మరో రకంగానో ప్రమాదం కలిగించేవో కాదు. ఈ చెట్టు గింజలకు అంటుకుపోయే జిగురు లాంటి పదార్థం ఉంటుంది, దానిపై సన్నని కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. చెట్టుపై వాలిన ఏవైనా పక్షులు, పురుగులకు ఈ గమ్, కొక్కాలు ఉన్న గింజలు అంటుకుని.. తర్వాత ఎప్పుడో దూరంగా రాలిపోతాయి. అలా దూరంగా పడిన గింజలు మొలకెత్తి పిసోనియా చెట్లు పెరుగుతాయి. ఇలా చెట్లు, మొక్కల జాతులు విస్తరించడం ప్రకృతిలో సహజమే. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది.  

ఆ గింజలతో.. 
పిసోనియా చెట్ల గింజలకు ఉండే జిగురు చాలా పవర్‌ఫుల్‌. పిట్టలేవైనా ఈ చెట్టుమీద వాలినప్పుడు ఆ గింజలు వాటి ఈకలకు అతుక్కుంటాయి. గుత్తులు గుత్తులుగా గింజలు ఉంటాయి కాబట్టి.. పిట్టలకు తల దగ్గరి నుంచి తోక దాకా అంటుకుంటాయి. వాటి బరువు వల్ల, ఈకలు అతుక్కుపోవడం వల్ల పక్షులు ఎగరలేకపోతాయి. ఎగిరినా కొంత దూరంలో కిందపడిపోతాయి. గింజలు ఎక్కువగా అతుక్కుంటే పెద్దగా కదల్లేని స్థితిలో పడిపోతాయి. చివరికి ఆహారం లేక చనిపోతాయి. లేకుంటే పాములు, ఇతర జంతువులకు ఆహారంగా మారిపోతాయి. పిట్టలు, చిన్న చిన్న పక్షులు అయితే.. పిసోనియా గింజల గుత్తులకు అలాగే అంటుకుపోతాయి. అలా వేలాడుతూనే చనిపోతాయి. చాలా చోట్ల పిసోనియా చెట్లకు పక్షుల డెడ్‌బాడీలు, అస్థి పంజరాలు వేలాడుతూ కనిపిస్తాయి. అందుకే వీటిని ‘బర్డ్‌ క్యాచర్స్‌’ అని పిలుస్తుంటారు. 

ఈ చెట్లంటే.. పక్షులకు ఎంతో ఇష్టం 
పిసోనియా చెట్ల కారణంగా ప్రాణాలు పోతున్నా కూడా.. చాలా రకాల పక్షులకు ఈ చెట్లంటే ఎంతో ఇష్టం. ఎక్కడా కూడా పక్షులు గూళ్లు పెట్టని పిసోనియా చెట్టు ఒక్కటి కూడా కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా సముద్ర పక్షులు వలస వచ్చే సమయంలోనే పిసోనియా చెట్లు పూలు పూసి, గింజలు ఏర్పడుతాయి. ఆ టైంలో వలస పక్షులు పిసోనియా చెట్లపై గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెడతాయి. ఈ పక్షి పిల్లలకు కొన్ని గింజలు అంటుకున్నా కూడా కింద పడిపోతాయి. సీషెల్స్‌ దేశంలోని కజిన్‌ ఐల్యాండ్స్‌లో విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. పిసోనియా చెట్ల కారణంగా.. వైట్‌ టెర్న్స్‌ పక్షుల్లో నాలుగో వంతు, ట్రాపికల్‌ షీర్‌వాటర్స్‌ పక్షుల్లో పదో వంతు చనిపోతున్నాయని తేల్చారు. ఏటా లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నట్టు గుర్తించారు. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 
చదవండి: ఇదేం ముంగిస.. ఉన్నట్టుండి చస్తుంది.. మళ్లీ!
వైరల్‌: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్‌ ఆట

మరిన్ని వార్తలు