అన్‌స్టాపబుల్‌ జర్నీ.. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నిస్‌బుక్‌కి ఎక్కింది!

6 Jan, 2023 10:03 IST|Sakshi

హోబార్ట్‌(టాస్మానియా):  రాత్రిపగలు తేడా లేకుండా ఏకధాటిగా పదకొండు రోజుల ప్రయాణం. ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఆకలి దప్పిక తీర్చుకోలేదు. పదకొండు వేల కిలోమీటర్లు వలస ప్రయాణంతో సరికొత్త రికార్డుతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది ఓ గాడ్‌విట్‌ పక్షి. 

గాట్‌విట్‌(లిమోసా లప్పినోకా).. నెమలి తరహాలో ఉండే ఓ పక్షి. దానికి 234684 అనే నెంబర్‌తో 5జీ శాటిలైట్‌ ట్యాగ్‌ను పక్షి కింది భాగంలో బిగించారు. అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియాకు చేరుకుని ప్రయాణం పూర్తి చేసుకుంది ఈ పక్షి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడ ఆగలేదు. ఆహారం, నీటిని తీసుకోలేదు. తద్వారా అధికారికంగా అత్యధిక దూరం వలస ప్రయాణం చేసిన పక్షిగా రికార్డులు బద్ధలు కొట్టింది. 

అక్టోబర్‌ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులపాటు ఎక్కడా వాలకుండా ముందుకెళ్లింది అది. ఈ పక్షి ప్రయాణించిన దూరం.. ఈ భూమి పూర్తి చుట్టుకొలతలో మూడో వంతు!. లండన్‌ నుంచి న్యూయార్క్‌ మధ్య రెండున్నర సార్లు ప్రయాణిస్తే ఎంత దూరమో అంత!. గతంలో 217 మైళ్ల దూరం ఇదే గాడ్‌విట్‌ సంతతికి చెందిన పక్షి విరామం లేకుండా ప్రయాణించింది. ఈ రాత్రిపగలు సుదీర్ఘ ప్రయాణంలో.. ఆ పక్షి బరువు సగం తగ్గిందని టాస్మానియాకు చెందిన వన్యప్రాణి నిపుణులు ఎరిక్‌ వోఎహ్లెర్‌ చెప్తున్నారు. 

చిన్న తోక, పొడుగు ముక్కు, సన్నకాళ్లతో ఉండే గాడ్‌విట్‌ పక్షి.. 90 డిగ్రీల యూటర్న్‌ తీసుకుని నేల మీద వాలే ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంది. అయితే..  రిస్క్‌తో కూడుకున్న జీవితం వీటిది. లోతైన నీటిపై గనుక అవి వాలితే.. ప్రాణాలు కోల్పోతాయి. వాటి కాళ్ల కింద భాగం నీటి తేలేందుకు అనుగణంగా ఉండదు. తద్వారా అవి నీళ్లలో పడితే మళ్లీ పైకి ఎగరలేవు.  సుదీర్ఘ దూరం ప్రయాణించిన  234684 గాడ్‌విట్‌ పక్షి సముద్రాలు దాటుకుంటూ రిస్క్‌తో కూడిన ప్రయాణమే చేసిందని ఎరిక్‌ వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు