వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి..

18 Apr, 2023 11:46 IST|Sakshi

ఓ టీనేజర్‌ పొరపాటున మరొకరి ఇంటి బెల్‌ మోగించాడు. అంతే ఓ వ్యక్తి ఏ మాత్రం కనికరం లేకుండా తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ టీనేజర్‌ తలలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ భయానక ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..16 ఏళ్ల అఫ్రికన్‌ అమెరికన్‌ రాల్ఫ్‌ పాల్‌ యార్ల​ అనే వ్యక్తి తన కవల సోదరులను స్నేహితుడి ఇంటి నుంచి పికప్‌ చేసుకునేందుకు వెళ్లాడు. అప్పుడే అతను పొరబడి వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ను నాక్‌ చేశాడు. అంతే ఆ ఇంటి యజమాని ఆండ్రూ లెస్టర్‌ నిర్ధాక్షిణ్యంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో రెండు తుటాలు సరాసరి టీనేజర్‌ తలలోకి దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఆండ్రూ లెస్టర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే   గంటల కస్టడీ తర్వాత ఎలాంటి ఆరోపణలు మోపకుండానే అతను విడుదలయ్యాడు. దీంతో నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని నిరసనలు వెల్లవెత్తాయి.

ఇది జాత్యాహంకారంతో జరిగినే హత్య అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు టీనేజర్‌ అత్త ఫెయిత్‌ స్ఫూన్‌మూర్‌ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పుకొచ్చారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో నల్లజాతీయులపై హింస జరుగతూనే ఉంది దీనికి జవాబుదారితనం వహించాల్సిందే అంటూ ప్రజలు ‍ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు మిస్సోరీ పోలీస్‌ చీఫ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇది జాతిపరంగా జరిగిన హత్యగా ఆయన పేర్కొనలేదు. తాను వారి ఆవేదనను అర్థం చేసుకుంటానని చెప్పారు.

అలాగే జాతి పరంగా జరిగిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడమే గాక నిందితుడిని అదీనంలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. చివరికి నిందితుడు ఆండ్రూ లెస్టర్‌(85) వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక కోర్టు కూడా సదరు నిందితుడు సాయుధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి దోషిగా తేల్చింది. అంతేగాదు అతనికి కోటి రూపాయాల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. అదృష్టవశాత్తు టీనేజర్‌ కూడా కొద్దిలో ప్రాణాపాయంతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సదరు బాధితుడితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫోన్‌లో సంభాషించి..క్షేమ సమాచారాలను అడిగినట్లు వైట్‌హౌస్‌ పేర్కొనడం గమనార్హం.

(చదవండి: అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్‌.. 200 మంది మృతి)

మరిన్ని వార్తలు