Corona Vaccine: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు!

4 Jul, 2021 03:13 IST|Sakshi

కోవిడ్‌ టీకాలపై మ్యూనిచ్‌ యూనివర్సిటీ నివేదిక

మ్యూనిచ్‌: సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్‌ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్‌ క్లాట్స్‌ కనిపించాయని నూతన అధ్యయనం వెల్లడించింది. తప్పుగా ఇంజెక్షన్‌ ఇచ్చేటప్పుడు కండరంలోకి ఎక్కించాల్సిన మందు పొరపాటున రక్తనాళాల్లోకి ఇంజెక్ట్‌ అవుతుందని, అందువల్ల తేడా చేస్తుందని మ్యూనిచ్‌ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌ సహా పలు టీకాల విషయంలో ఈ రక్తంలో గడ్డల(పోస్ట్‌ వ్యాక్సినేషన్‌ థ్రోంబాటిక్‌ థ్రోంబోసైటోపెనిక్‌ సిండ్రోమ్‌– టీటీఎస్‌ లేదా వ్యాక్సిన్‌ ఇండ్యూస్డ్‌ ఇమ్యూన్‌ థ్రోంబాటిక్‌ థ్రోంబోసైటోపీనియా– వీఐటీటీ) ఫిర్యాదులు వినిపించాయి. అయితే ఇది టీకాలో సమస్య కాదని, టీకా ఎక్కించడంలో సమస్యని తాజా నివేదిక తెలిపింది.

‘‘ఇంజక్షన్‌ నీడిల్‌ను కండరంలోకి చేరేంత లోతుగా పంపించకుండా పైపైన గుచ్చినప్పుడు టీకామందు కండరంలోకి బదులు రక్తంలోకి నేరుగా వెళ్తుంది. సూది మందు ఇచ్చే సమయంలో చేతిపై చర్మాన్ని వత్తి పట్టుకోకూడదు. ఇంట్రామస్కులార్‌ ఇంజెక్షన్లు(కండరాల్లోకి పంపే సూదిమందు) ఇచ్చేటప్పుడు ఏమాత్రం చర్మాన్ని పించప్‌(వత్తి పట్టుకోవడం) చేయకుండా సాఫీగా ఉన్న చర్మంపై టీకానివ్వాలి. లేదంటే సూది మొన కేవలం చర్మాంతర్గత కణజాలం వరకే చేరుతుంది. దీంతో టీకా మందు కణజాలంలోకి పీల్చుకోవడం జరగదు. పైగా కొన్నిమార్లు ఇలా చేయడం వల్ల సూదిమొన రక్తనాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు టీకా మందు రక్తంలోకి ప్రవేశించి క్లాట్స్‌ కలిగించే ప్రమాదం ఉంది’’అని కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు రాజీవ్‌ జయదేవన్‌ వివరించారు. టీకా ఇచ్చేముందు సూది గుచ్చిన అనంతరం పిస్టన్‌ను వెనక్కు లాగి చెక్‌ చేసుకోవడం ద్వారా సూది మొన రక్తనాళంలోకి చేరలేదని నిర్ధారించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు