నేడే బెజోస్‌ అంతరిక్ష యాత్ర

20 Jul, 2021 03:16 IST|Sakshi

పైలట్‌రహిత స్పేస్‌క్రాఫ్ట్‌లో 100 కి.మీ.ల ఎత్తుకు..

బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు

82 ఏళ్ల మాజీ మహిళాపైలట్‌

18 ఏళ్ల యువకుడు

వాషింగ్టన్‌: దిగ్గజ సంస్థ ‘ఆమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర నేడే జరగనుంది. 20 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెపర్డ్‌’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్‌ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకువస్తుంది. బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్‌ అయిన 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏళ్ల యువకుడు ఆలీవర్‌ డీమన్‌ ఈ యాత్ర చేయనున్నారు.

కొన్ని రోజుల క్రితమే మరో బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తన సొంత స్పేస్‌ క్రాఫ్ట్‌లో విజయవంతంగా అంతరిక్ష యాత్ర ముగించిన విషయం తెలిసిందే. పశ్చిమ టెక్సాస్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం బెజోస్‌ సహా నలుగురు తుది దశ సన్నాహాల్లో ఉన్నారు. భద్రత, సిమ్యులేషన్, భూ గురుత్వాకర్షణ పరిధి దాటిన తరువాత కేబిన్‌లో తేలియాడాల్సిన తీరు, రాకెట్‌ పనితీరు, అస్ట్రోనాట్స్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర బాధ్యతలు.. తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఇది అందరూ సివిలియన్సే వెళ్తున్న పైలట్‌ రహిత అంతరిక్ష యాత్ర కావడం విశేషం.

శిక్షణ పొందిన అస్ట్రోనాట్స్‌ ఎవరూ ఇందులో లేరు. స్పేస్‌ క్రాఫ్ట్‌ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి ఎగురుతుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ ‘న్యూ షెఫర్డ్‌’ ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ అస్ట్రోనాట్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఆరియన్‌ కార్నెల్‌ ప్రకటించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్‌ అలాన్‌ షెఫర్డ్‌ పేరును బ్లూ ఆరిజిన్‌ సంస్థ తమ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ తరహాలో దీనిని నిర్మించారు. అయితే, పరిసరాలను 360 డిగ్రీల కోణంలో చూసేలా క్య్రూ క్యాప్సూల్‌ను రూపొందించారు. ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ నిట్టనిలువగా టేకాఫ్‌ అవుతుంది. అలాగే, నిట్టనిలువుగానే ల్యాండ్‌ అవుతుంది. ఈ అంతరిక్ష యాత్రకు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. 82 ఏళ్ల వృద్ధ మహిళ, 18 ఏళ్ల పిన్న వయస్కుడు కలిసి చేస్తున్న యాత్ర ఇది.

మరిన్ని వార్తలు