బాబ్‌రే.. నీ పెయింటింగ్స్‌ అద్భుతం!

23 May, 2021 12:20 IST|Sakshi

బాబ్‌ డిలాన్‌ బర్త్‌డే స్పెషల్‌!

అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్‌ డిలాన్‌. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్‌ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్‌ డిలాన్‌ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు.  2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్‌ బ్లాంక్‌ సిరీస్‌’ పేరిట బాబ్‌ డిలాన్‌ పెయింటింగ్స్‌ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్‌ను చూసిన వారంతా..‘‘బాబ్‌ డిలాన్‌ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ  అంతే రమణీయం’ అని అభినందించారు.

ఆతరువాత లండన్‌లోని నేషనల్‌ పోర్టరేట్, డెన్మార్క్‌లోని ద నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్‌ పెయింటింగ్‌లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్‌ పెయింటింగ్స్‌ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్‌ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్‌ ఫిలిప్‌ ఫ్రాస్ట్‌ ఆర్ట్‌ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్‌ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్‌’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో బాబ్‌ డిలాన్‌ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్‌’ ఎగ్జిబిషన్‌ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్‌తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్‌ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్‌లను ‘అమెరికన్‌ పాస్టోరల్స్‌’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్‌ 30న మొదలై 2022 ఏప్రిల్‌ 17 వరకు కొనసాగుతుంది.

బాబ్‌ డిలాన్‌.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు,  ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్‌గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్‌ డిలాన్‌ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన  పెయింటింగ్స్‌ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్‌ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో  ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. 
– పి. విజయా దిలీప్‌

చదవండి:  ద బాబ్‌రే... నిత్య యవ్వనం నీ స్వరం!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు