కరోనా ఉధృతి.. నెల రోజుల లాక్‌డౌన్‌

1 Nov, 2020 10:09 IST|Sakshi

లండన్‌ : కరోనా కేసులు పెరుగుతుండటంపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు నెల రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. శనివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ విషయమై జరిగిన చర్చిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. గురువారం నుంచి ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌ 2 వరకు ఇది కొనసాగనున్నట్లు తెలిపారు. దేశంలో మరోసారి కరోనా ఉధృతి పెరగటంతో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామని మీడియాకు వెల్లడించారు.

కాగా కేబినెట్‌ భేటీ సందర్భంగా కరోనా కట్టడికి ఆంక్షలను మరింత కఠినతరం చేసే విషయంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సీని యర్‌ మంత్రుల సలహా తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీ, చీఫ్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ పాట్రిక్‌ వలాన్స్‌ల సలహాను కూడా తీసుకునున్నారు. వచ్చే డిసెంబర్‌లో క్రిస్మస్‌ నాటికి ఈ ఆంక్షలను మళ్లీ సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం కొత్తగా బ్రిటన్‌ 22 వేలకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. యూకే వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

కాగా గత కొంతకాలంగా యూరప్‌లో కోవిడ్‌ విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్‌లో రెండోసారి లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గురువారం నుంచే లక్షలాది మంది జనం సొంతూళ్ళకు పయనమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది.

మరిన్ని వార్తలు