Boris Johnson Wax Statue: రోడ్డుపైకొచ్చిన బోరిస్‌ మైనపు విగ్రహం.. ఫోటోలు వైరల్‌

9 Jul, 2022 12:57 IST|Sakshi

లండన్‌: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్‌ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్‌పూల్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్‌ సెంటర్‌ ముందుకు తరలించారు. జాబ్‌ సెంటర్‌ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

నీలిరంగు టైతో కూడిన సూట్‌లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్‌ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్‌ టుస్సాడ్స్‌. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్‌సెంటర్‌ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్‌ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ ఈ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. 'బోరిస్‌ ఎక్స్‌ బ్లాక్‌పూల్‌' అంటూ నోట్‌ రాసుకొచ్చింది. 

బోరిస్‌ జాన్సన్‌ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్‌ లైవ్‌ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. 

మరిన్ని వార్తలు