అక్కడ వేసవి వరకూ లాక్‌డౌన్‌.. 

23 Jan, 2021 09:57 IST|Sakshi

బ్రిటన్‌లో వేసవి వరకు లాక్‌డౌన్‌

వ్యాక్సినేషన్‌ కొసాగుతున్నా కరోనా విజృంభణ 

బ్లూంబర్గ్‌: బ్రిటన్‌లో కొనసాగుతోన్న మూడో దఫా లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తామని ముందస్తుగా ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్, హోంమంత్రి ప్రీతీ పటేల్‌ అభిప్రాయపడుతున్నారు. గ్రేట్‌ బ్రిటన్‌లో 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందిస్తున్నప్పటికీ, కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉందని, ఈ వేసవి కాలం ఏప్రిల్‌ నాటికి గానీ పరిస్థితులు మెరుగుపడవని వారు భావిస్తున్నారు. ఇప్పటికీ అనేక మంది ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం వల్ల మహమ్మారిని కట్టడి చేయడం కష్టతరంగా మారడంతో, కోవిడ్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నారు. ఇళ్ళల్లో గుంపులు గుంపులుగా కలిసి పార్టీలు నిర్వహించే వారిపై బ్రిటన్‌ పోలీసులు 1,097 డాలర్ల జరిమానా విధిస్తూన్నట్టు లండన్‌లో జరిగిన మీడియ సమావేశంలో ప్రీతీ పటేల్‌ తెలిపారు.

అది మళ్ళీ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకునే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టేనని వారు అభిప్రాయపడ్డారు. మార్చి ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరిస్తామని బ్రిటన్‌ మంత్రులు గతంలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సవరించే అవకాశం కనిపించడం లేదు. ఫిబ్రవరి 15లోగా బ్రిటన్‌లోని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న 15 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోగానే లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై ఆయన పార్టీకి చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యింది.
(చదవండి: బ్రెగ్జిట్‌తో మారేవేంటంటే...)

ఆంక్షలు... 
బ్రిటన్‌లో షాప్స్, రెస్టారెంట్లు, స్కూల్స్‌ని మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రాకూడదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు వేసవి వరకూ కొనసాగడం తప్పదని ప్రభుత్వం తేల్చి చెపుతోంది. మూడు శతాబ్దాల్లో అత్యంత తీవ్ర తిరోగమనానికి గురైన ఆర్థిక వ్యవస్థను ఈ ఆంక్షలు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  కోవిడ్‌ వల్ల గత 24 గంటల్లో బ్రిటన్‌లో 1,290 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 95,829 కి చేరుకుంది. 
 

మరిన్ని వార్తలు