కరోనా నివారణలో ‘బీపీ మందులు’ 

24 Aug, 2020 16:23 IST|Sakshi

లండన్‌ : ‘బ్లడ్‌ ప్రెషర్, డయాబెటీస్‌’తో బాధ పడుతున్న వారికి కరోనా వైరస్‌ సోకినట్లయితే ప్రాణాంతకమవుతుందని ఇప్పటికి పలు సర్వేలు వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే కరోనా బారిన పడిన ‘హై బ్లడ్‌ ప్రెషర్‌’ రోగులకు బ్లడ్‌ ప్రెషర్‌ నివారణ మందులను ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది. కరోనాతో బాధ పడుతున్న బ్లడ్‌ ప్రెషర్‌ రోగులకు రామిప్రిల్, లొసార్టన్‌ మందులు ఇవ్వగా, వారిలో మూడోవంతు మంది, అంటే 33 శాతం మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని, కోలుకున్నారని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లినా’ పరిశోధకలు జరిపిన అధ్యయనంలో తేలింది.

అయితే వారిలో ఎక్కువ శాతం మంది ‘వెంటిలేటర్‌’ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారని, వెంటిలేటర్‌ వరకు వెళ్లిన కరోనా రోగులు కూడా ఈ మందులతోని కోలుకున్నారని పరిశోధకులు తెలిపారు. అయితే బీపీ లేని కరోనా రోగులపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుందో! ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. తాము ప్రస్తుతం బీపీ ఉన్న రోగులపై అధ్యయనానికే పరిమితం అయ్యామని వారు చెప్పారు.

బ్రిటన్‌లో బీపీతో బాధపడుతున్న దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్‌ను వాడుతున్నారు. అమెరికాలో దాదాపు కోటి మంది బీపీతో బాధ పడుతున్నారు. బీపీ రోగులు కరోనా నుంచి కోలుకునేందుకు రామిప్రిల్, లొసార్టన్‌ మందులు బాగా పని చేస్తున్నట్లు దాదాపు 30 వేల మంది కరోనా రోగులపై యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. 
చదవండి: పొగాకు అలవాటుకు కరోనా చెక్‌

మరిన్ని వార్తలు