బ్రెజిల్‌లో ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు

8 Apr, 2021 02:16 IST|Sakshi
కరోనా మృతుల కోసం సావోపాలోలో ఏర్పాటు చేసిన శ్మశానవాటిక

సావోపాలో: బ్రెజిల్‌లో మొదటిసారిగా ఒకే రోజులో 4 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 4,195 మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 3.40 లక్షలుగా నమోదైంది. అమెరికా, పెరూ తర్వాత ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదైన మూడో దేశంగా బ్రెజిల్‌ నిలిచింది. దేశంలో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కరోనా సోకిన వారిలో అత్యధికులు ఆస్పత్రి పాలవుతూ ఉండడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది.

బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా లాక్‌డౌన్‌కి వ్యతిరేకం కావడం వల్లే ఈ స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అధ్యక్షుడికి మద్దతుగా ఉన్న గవర్నర్లు, మేయర్లు, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు  భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోక పోవడంతో కేసులు పెరిగిపోతున్నాయని బ్రెజిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ పాలసీ స్టడీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మిగెల్‌ లాగో అంచనా వేశారు. బ్రెజిల్‌ ఆస్పత్రుల్లో 90 శాతం పడకలు కోవిడ్‌ రోగులకే కేటాయించాల్సి వస్తోంది. ఆ దేశంలో వ్యాక్సినేషన్‌ కూడా మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 3 శాతం మంది ప్రజలు కరోనా టీకా తీసుకోలేదు.

 


 

మరిన్ని వార్తలు