బ్రెజిల్‌ అధ్యక్షుడి వినూత్న అభినందన

24 Jan, 2021 04:33 IST|Sakshi

జెనీవా: కరోనా వైరస్‌తో అతలాకుతలమైన బ్రెజిల్‌కు భారత్‌ 20 లక్షల డోసుల్ని పంపడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీని వినూత్నంగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్‌ను హనుమంతుడు మోసుకొచ్చిన సంజీవిని పర్వతంతో పోల్చారు. ‘నమస్కార్‌ ప్రధాని మోదీ, ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక మహమ్మారిని జయించడంలో ఒక అద్భుతమైన భాగస్వామిని పొందడం గౌరవంగా భావిస్తున్నాం. టీకా డోసుల్ని మాకు పంపించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు సంజీవిని పర్వతం స్థానంలో వ్యాక్సిన్‌ పర్వతాన్ని హనుమంతుడు మోసుకొస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశారు.  

భారత్‌ వ్యాక్సిన్‌ మైత్రి భేష్‌: డబ్ల్యూహెచ్‌ఓ
ఇరుగు పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమంపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసల జల్లు కురిపించింది. భారత్‌ మాదిరిగా ప్రపంచదేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే త్వరలోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అన్నారు. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అంశంలో నైబర్‌ ఫస్ట్‌ విధానాన్ని అవలంబిస్తున్న ప్రధాని మోదీని అభినందించారు. ‘‘కోవిడ్‌–19పై మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు అన్నీ పంచుకుంటూ ఉంటేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుంది. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం’ అని టెడ్రోస్‌ ట్వీట్‌ చేశారు.
బోల్సనారో ట్వీట్‌ చేసిన చిత్రం

మరిన్ని వార్తలు