జర్నలిస్ట్‌లపై విరుచుకుపడిన బ్రెజిల్‌ అధ్యక్షుడు

25 Aug, 2020 09:19 IST|Sakshi

బ్రసిలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మరోసారి జర్నలిస్ట్‌లపై నోరు పారేసుకున్నారు. విలేకరులంతా పిరికి వాళ్లని... త్వరగా కోవిడ్‌ బారిన పడతారని.. కోలుకోలేరంటూ తీవ్రంగా దూషించారు. బోల్సొనారో కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘డిఫీట్‌ కోవిడ్‌-19’ కార్యక్రమానికి హాజరైన బోల్సొనారో.. తన స్వీయ అనుభవాలను వివరించారు. హైడ్రాక్సిక్లోరోక్విన్‌ వాడకంతో పాటు తనలోని రోగనిరోధక శక్తి కారణంగానే తాను కోవిడ్‌ను జయించగలిగానని తెలిపారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌లను ఉద్దేశించి ‘మీలో ఎవరైనా కోవిడ్‌ బారిన పడవచ్చు. కానీ మీకు ధైర్యం లేదు. పిరికివాళ్లు. అందువల్ల మీరు కరోనా నుంచి కోలుకోలేరు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీరు చెడును మాత్రమే సృష్టించగలరు. మీ కలాలను కేవలం చెడును సృష్టించడానికే ఉపయోగిస్తున్నారు. మీరు త్వరగా కోలకోలేరు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బోల్సొనారో. (‘ఇది చాలా భయకంరంగా ఉంది’)

కొద్ది రోజుల క్రితం ఒక విలేకరిని మూతి పగలకొడతానంటూ బెదిరించిన సంగతి తెలిసిందే. బ్రెసిలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్‌ పర్యటన సందర్భంగా బోల్సొనారో భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఒక విలేకరి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహోదగ్నుడైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ ఆ విలేకరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు