Marília Mendonca Death: గాయని సంతోషంగా వీడియో, అంతలోనే తీరని విషాదం

6 Nov, 2021 11:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో మ్యూజికల్‌ కన్పర్ట్‌లో అభిమానులను ఉర్రూతలూగించాల్సిన ప్రముఖ గాయని ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి.  తను ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి పోవడంతో బ్రెజిలియన్ గాయని మారిలియా మెండోంకా  (26) కన్నుమూసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.  ఆమెతో పాటు  మేనేజర్ , సహాయకుడు, పైలట్ , కో-పైలట్ కూడా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరణానికి కొన్ని గంటల ముందు విమానంనుంచే ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు తరలిపోవడం విచారకరమంటూ ఆమె స్నేహితులు,  సన్నిహితులు కంటతడి పెడుతున్నారు. 

మిడ్‌వెస్ట్రన్ నగరం గోయానియా నుండి కరాటింగాకు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది. విమానం భూమిని ఢీకొట్టడానికిముందు తమ విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టిందని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ సెమిగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో బ్రెజిల్‌లోని ప్రముఖ గాయకులలో ఒకరైన మారిలియా మెండోంకా, మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు పైలట్‌, కోపైలట్‌ కూడా మరణించినట్లు  మెండోంకా  ప్రతినిధి వెల్లడించారు.

ఈ విషాద వార్తపై ఆమె అభిమానులు, రాజకీయ నాయకులు, పలువురు గాయనీ గాయకులు, సాకర్ ఆటగాళ్లతో సహా బ్రెజిల్ నలుమూలల నుండి సోషల్ మీడియాలో  సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

దీంతో బాధితుల అభిమానులు,కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై ఐ రిఫ్యూజ్ టు బిలీవ్, ఐ జస్ట్ రిఫ్యూజ్"  అంటూ ఆమె స్నేహితుడు, బ్రెజిల్ సాకర్ స్టార్ నెయ్‌మార్ ట్వీట్‌ చేశారు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా సంతాపాన్ని తెలిపింది .ఈ వార్తతో దేశం మొత్తం షాక్ అయ్యిందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో  విచారం ప్రకటించారు.  మెండోంకా గొప్ప కళాకారిణి అని, ఆమె లేని లోటు తీరనిదని బోల్సోనారో ట్వీట్ చేశారు.  ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. 


కాగా మెండోంకా బ్రెజిలియన్ కంట్రీ మ్యూజిక్ స్టైల్ "సెర్టానెజో"  ద్వారా పాపులర్‌ అయింది. 2019లో రిలీజ్‌ చేసిన ఆల్బంకు లాటిన్ గ్రామీని గెలుచుకుంది. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి బ్రెజిల్‌లో విస్తృత లాక్‌డౌన్‌లకు దారితీసినప్పుడు, మెండోంకా  ప్రత్యక్ష ప్రసారంచేసిన వీడియో 3.3 మిలియన్ల  వ్యూస్‌తో  యూ ట్యూబ్‌లో  ప్రపంచ రికార్డు సాధించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 39.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. మెండోంనాకు ఒక కుమారుడు ఉన్నాడు. వచ్చే నెలకు ఆ బాలుడికి 2 సంవత్సరాలు నిండనున్నాయి.

A post shared by Marilia Mendonça (@mariliamendoncacantora)

మరిన్ని వార్తలు