Brazil: జనాగ్రహంతోనూ కరోనా విలయం!

4 Jun, 2021 12:30 IST|Sakshi

కరోనా జస్ట్ ఎ ఫ్లూ అనే స్టేట్​మెంట్​ ఇచ్చిన తిట్లు తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారో శైలిపై తీవ్ర దుమారం రేగుతోంది. తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు కారకుడంటూ ఆయనపై వేల క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో బోల్సోనారోకు వ్యతిరేకంగా ఓవైపు ప్రజలు నిరసనలు చేపడుతుంటే.. ఆ నిరసనల వల్ల కేసుల తారాస్థాయి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

బ్రసీలియా: కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సొంత దేశ ప్రజలు ఆయన మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులు, ఫలితంగానే వైరస్ వ్యాప్తికి కారకుడయ్యాడంటూ మండిపడుతున్నారు. అయితే బోల్సోనారో మీద కోపంతో చేస్తున్న నిరసనలే ఇప్పుడు అక్కడ కొంప ముంచుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. 

పెరుగుతున్న కేసులు
బోల్సోనారోకి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్​కు వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్స్​, పైగా ఇప్పుడు  ఫుట్​బాల్ మ్యాచ్​లకు మరోసారి అనుమతులు ఇవ్వడంపై వేల మంది రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వైరస్​ బారిన పడుతున్న వారిలో నిరసనకారులు కూడా ఉంటున్నారని న్యూయార్క్​కి చెందిన ఓ ప్రముఖ వెబ్​సైట్ కథనం ప్రచురించింది. కిందటి నెలలో బ్రసీలియాలో చేపట్టిన పదివేల మంది నిరసనకారుల్లో.. 2 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వాళ్లలో 189 మంది చనిపోయినట్లు ఆ వెబ్​ సైట్ కథనం పేర్కొంది. అలాగే పోయిన శనివారం కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. 16 నగరాల్లోని వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు బోల్సోనారోని ‘రక్త పిశాచి’గా పేర్కొంటూ సావోపాలో బెలూన్లు ప్రదర్శించారు. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న సుమారు 22 వేలమంది కరోనా బారినపడ్డారని, 380 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ కథనం ప్రస్తావించింది. మరోవైపు ఈ కథనంపై స్పందించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం నిరాకరించింది. 

తగ్గని మరణాలు
కాగా, బుధవారం తన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి జాతిని ఉద్దేశించి బొల్సొనారో ప్రసగించాడు. ఈ విషయం ముందే తెలియడంతో ఆ టైంకి ప్రజలంతా ప్లేట్లు, చప్పట్లతో నిరసన తెలియజేశారు. అయితే వీధుల్లోకి వేలమంది గుంపులుగా రావడం, మాస్క్​లు లేకుండా నిరసనల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోందని బ్రెజిల్ ఆరోగ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనల టైంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలా ఉంటే బ్రెజిల్​లో మరణాల లెక్కలు మాత్రం తగ్గట్లేదు. బ్రెజిల్​లో కరోనా విజృంభణ తర్వాత ఒకానొక తరుణంలో నాలుగు వేలకు పైగానే మరణాలు సంభవించాయి. బుధవారం కూడా లక్ష కేసులు, ఇరవై ఐదు వందలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు సంయమనం పాటించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: రూల్స్​ పాటించరా? అయితే..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు