‘పెళ్లికి చెప్పినంత ఖర్చు పెడతారా.. లేదా పారిపొమ్మంటారా?!’

16 Jun, 2021 20:41 IST|Sakshi

అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే.. అదేంటో మహా చెడ్డచిరాకు వస్తుంది కదా.. ఆ విసుగు, కోపంలో మనం ఏం చేస్తామో.. ఎలాంటి మాటలు మాట్లాడతామో మనకే తెలియదు.. అమెరికాకు చెందిన ఓ కాబోయే పెళ్లికూతురికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లడంతో తల్లిదండ్రులనే బ్లాక్‌మెయిల్‌ చేసే స్థితికి చేరుకుంది. తన పెళ్లికి కోరినంత ఖర్చు చేయకపోవడం కుదరనడంతో... తనకు నచ్చినవాడితో పారిపోతానంటూ ఆమె బెదిరించిన తీరుపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. రెడిట్‌లో ఆమె స్వయంగా పోస్ట్‌ చేసిన వివరాలు..

‘‘ఇటీవలే నాకు నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి పెళ్లి కోసం ఎన్నో కలలు కంటున్నాను. ముఖ్యంగా ఆరోజు ఎలా మేకప్‌ కావాలి. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి వంటి అంశాల చుట్టే నా మనసు తిరుగుతోంది. నిజానికి మా తల్లిదండ్రులకు నేనొక్కదాన్నే కూతుర్ని. వారి సంపాదనకు కూడా కొదవేం లేదు. చిన్నప్పటి నుంచి ఏం అడిగినా పెళ్లి సమయంలో ఖర్చు చేసేందుకు పొదుపు చేస్తున్నాం అని చెప్పేవారు. 

దాంతో ఎంగేజ్‌మెంట్‌ తర్వాత నుంచే నా బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవడం మొదలుపెట్టాను. వేదిక, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తదితర విషయాల కోసం 25 వేల డాలర్ల బడ్జెట్‌ అనుకున్నా. కానీ మా నాన్న.. పెళ్లిరోజున 40 వేల డాలర్లు ఖర్చు చేద్దాం అని చెప్పారు. మా అమ్మ కూడా అదే చెప్పింది. అయితే, 25 వేల డాలర్లలో వేడుక ఖర్చు పూర్తి చేస్తే కాస్త మిగుల్చుకోవచ్చని సలహా కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఆఖరికి 20 వేల డాలర్లకు బడ్జెట్‌ ఫిక్స్‌ చేశారు. వెడ్డింగ్‌ గౌన్‌, వీల్‌(తలపై కప్పుకునే వస్త్రం) కోసం కేవలం 3 వేల డాలర్లు. 

ఇలా అన్నింటికి ఒక్కొక్కటిగా తగ్గించేస్తున్నారు. నాకు చిరాకేసింది. అందుకే చెప్పినంత ఖర్చు చేస్తారా లేదంటే నచ్చిన వ్యక్తితో లేచిపొమ్మంటారా అని బెదిరించాను’’ అని సదరు యువతి రాసుకొచ్చింది. అయితే, ఆఖరికి ఏమైందన్న విషయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంచింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టుకు స్పందనగా.. చాలా మంది యువతి ప్రవర్తనను తప్పుపడుతుంటే.. కొంతమంది మాత్రం.. ముందే ఆమెకు ఆశ పెట్టకుండా అసలు విషయం చెప్పాల్సింది అని తల్లిదండ్రుల తీరును విమర్శిస్తున్నారు. 

చదవండి: ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు!

మరిన్ని వార్తలు