భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన బ్రిటన్..!‌

19 Apr, 2021 21:31 IST|Sakshi

లండన్‌: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో  బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ న్యూఢిల్లీ  పర్యటనను విరమించుకున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌ ప్రధాని పర్యటన రద్దు చేసుకున్న కొన్ని గంటలకే  భారత్‌ నుంచి బ్రిటన్‌ వచ్చే ప్రయాణికులపై నిషేధ్ఙాలను విధించింది. కాగా భారత్‌లో కరోనా కేసుల విస్పోటనంతో ఈ నిర్ణయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకుంది. బ్రిటన్‌ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ మాట్లాడుతూ, భారత్‌ను  "రెడ్ లిస్ట్" లో చేర్చుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. యుకే లేదా ఐరిష్ జాతీయులు మినహా భారతదేశం నుంచి  వచ్చే ప్రయాణికులందరినీ తాత్కాలికంగా  నిషేధిస్తున్నట్లు తెలిపింది.

భారత్‌ నుంచి వచ్చే బ్రిటన్‌, ఐరిష్‌ పౌరులను  10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. అంతకుముందు న్యూజిలాండ్‌ ప్రధాని  భారత్‌నుంచి వచ్చే ప్రయాణికులను ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాలు కు రావద్దంటూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.  కాగా భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది​. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదో రోజు రెండు లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య సోమవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1619 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.
 

చదవండి:  కరోనా ఎఫెక్ట్‌: భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం

మరిన్ని వార్తలు