బ్రిటన్‌లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది!

20 Oct, 2022 11:34 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ఆర్థిక సంక్షోభం.. నానాటికీ దిగజారుగుతోంది. ప్రధాని లిజ్‌ ట్రస్‌ నిర్ణయంతో పతనం దిశగా దేశం పయనిస్తోందని సొంత పార్టీ సభ్యులే విమర్శిస్తున్నారు. తాజాగా హోం సెక్రెటరీ సుయెల్లా బ్రేవర్మన్‌  తప్పుకోగా.. రాజీనామా లేఖలో ఆమె ఆర్థిక సంక్షోభ విషయంలో యూకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా నిప్పులు చెరిగారు.  

బ్రిటన్‌లో లక్షలాది మంది ఈ జీవన వ్యయ సంక్షోభాన్ని(Cost Of Living Crisis) నుంచి గట్టెక్కేందుకు భోజనాన్ని దాటవేస్తున్నారట. ఇక ఇంధన పేదరికం ఇది వరకే అంచనా వేసినట్లుగా తీవ్ర రూపం దాలుస్తోంది. చాలావరకు ఇళ్లలో విద్యుత్‌, హీటర్‌  ఈ విషయాలను విచ్‌ (Which?) అనే వినియోగదారుల సంస్థ తన సర్వే ద్వారా వెల్లడించింది. 

మూడు వేల మందిని సర్వే చేసిన ఈ సంస్థ.. ఆ అంచనా ఆధారంగా సగం యూకే ఇళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఒక్కపూట భోజనానికి దూరం కావడం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలోనూ ఆర్థిక కష్టాల ప్రభావం కనిపిస్తోంది. బ్రిటన్‌ వాసులు(80 శాతం దాకా) హెల్తీ మీల్స్‌కు దూరంగా ఉంటున్నారని విచ్‌ ప్రతినిధి సూ డేవీస్‌ చెప్తున్నారు.

బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 10.1 శాతానికి చేరుకుంది.  

ఇదిగాక.. ఇంధన ధరల ప్రభావంతో లక్షల ఇళ్లపై పడిందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెచ్చుమీరింది. లో ఇన్‌కమ్‌ కేటగిరీలో..  ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆహార కొరత సమస్యతో అతలాకుతలమవుతోంది.

2022వ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఆహార సంక్షోభం కనిపించింది. అయితే సెప్టెంబరులో 18 శాతం కుటుంబాలు తమ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు  ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇదీ చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! 

మరిన్ని వార్తలు